విశాఖ జూపార్క్‌కు చేరిన పెద్దపులి
ABN , Publish Date - Feb 07 , 2026 | 10:14 AM
రాజమండ్రి వాసులను కొద్దిరోజుల పాటు భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి విశాఖ జూపార్క్ చేరుకుంది. మత్తు ఇంజక్షన్ సాయంతో పులిని బంధించిన అటవీ శాఖ అధికారులు.. అనంతరం విశాఖ జంతు ప్రదర్శన శాలకు తరలించారు.
విశాఖపట్నం ఆంధ్రజ్యోతి: రాజమండ్రిలో గత 17 రోజులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన పెద్దపులిని అటవీశాఖ అధికారులు సురక్షితంగా విశాఖ జూపార్క్‌కు చేర్చారు. 'ఆపరేషన్ టైగర్' పేరుతో చేపట్టిన ప్రత్యేక చర్యలు విజయవంతంగా ముగిశాయి. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అటవీ సిబ్బంది.. పులికి మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. మత్తు ప్రభావం వచ్చిన కొద్దిసేపటికే రెస్క్యూ టీమ్ ఆ పులిని సురక్షితంగా బంధించింది. అనంతరం ప్రత్యేక బోనులో బంధించి కట్టుదిట్టమైన భద్రతల నడుమ విశాఖకు తరలించారు.
పులిని విశాఖపట్నంలోని ఎండాడ యానిమల్స్ రెస్క్యూ సెంటర్‌కు చేర్చారు. జూ క్యూరేటర్ మంగమ్మ, వెటర్నరీ డాక్టర్ భాను ప్రసాద్, అటవీశాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో పెద్దపులి విశాఖ జూపార్క్‌కు చేరుకుంది. ప్రస్తుతం పులి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో రాజమండ్రి పరిసర ప్రాంతాలవారు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా.. సుమారు 15 రోజుల క్రితం మహారాష్ట్ర నుంచి ఈ పులి వలస వచ్చిందని, దాని వయసు సుమారు 3 నుంచి 3.5 సంవత్సరాల మధ్య ఉంటుందని సీసీఎఫ్ దివాన్ మహాయొద్దేన్ తెలిపారు. పులిని అదుపులోకి తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారని చెప్పారు.
ప్రస్తుతం పులి ఆరోగ్యం బాగానే ఉందని సీసీఎఫ్ మహాయొద్దేన్ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి నేరుగా విశాఖకు తరలించగా.. జూ క్యూరేటర్ మంగమ్మ, సిబ్బంది నిన్న రాత్రి నుంచే పులిని సురక్షితంగా ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. పులిని సురక్షితంగా పట్టుకోవడంలో రెస్క్యూ టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయని సీసీఎఫ్ అభినందించారు. ప్రస్తుతం పులిని 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచామన్నారు. అనంతరం.. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనల మేరకు.. పులిని అటవీ ప్రాంతంలో వదలాలా? లేదా? అనే విషయాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రేసు గుర్రాలు.. చైర్మన్ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
Read Latest AP News And Telugu News