జగన్‌కు హిందూమతంపై గౌరవం లేదు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా
ABN , Publish Date - Feb 22 , 2026 | 01:30 PM
వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందువులన్నా, హిందూ మతమన్నా గౌరవం లేదని.. ఆలయాలపై దాడి జరిగినా మిన్నకుండిపోయారని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 22: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు, వైసీపీ నేతలకు హిందూమతం పట్ల, హిందువుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత నీచ బుద్ధితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు రాక్షసులు.. దేవాలయాలను, దేవుళ్లను నాశనం చేశారని.. కలియుగంలో జగన్, వైసీపీ నేతలు కూడా అదే తరహాలో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
'యుగాల్లో రాక్షసులు.. దేవాలయాలు, దేవుళ్లను నాశనం చేశారు. కలియుగంలో జగన్‌మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలూ అలాగే తయారయ్యారు. జగన్ రెడ్డికి హిందువులన్నా, హిందూమతం అన్నా విశ్వాసం లేదు. ఆయనకు కలియుగ దైవం పట్ల గౌరవం లేదు కాబట్టే భార్యతో వెళ్లలేదు. శ్రీవారి మాడవీధుల్లోనూ చెప్పులేసుకునే తిరిగారు. పరకామణిలో చోరీ జరిగితే చిన్న కేసులా సెటిల్ చేశాడు. హిందూమతంపై గౌరవం లేదని హిందువులను చులకనగా చూడటం దారుణం. ఆయన హయాంలో సుమారు 300 ఆలయాలపై దాడులు జరిగాయి. ఒక్కసారి కూడా వాటిని ఖండించలేదు. లడ్డూ కల్తీ విషయాన్ని కప్పిపుచ్చడానికి జోళ్లు వేసుకుని అపచారాలు చేస్తున్నారు. వేంకటేశ్వర స్వామి డబ్బులు పక్కదారి పట్టించేందుకు యత్నించారు. టీటీడీ వీఐపీ, సేవా టికెట్లను వైసీపీ నేతలు అడ్డగోలుగా అమ్ముకున్నారు. అన్యమత ప్రచారాలు చేశారు. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ.. జగన్ రెడ్డి తప్పు ఒప్పుకోవాలి. శ్రీవారికి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి' అని పల్లా శ్రీనివాసరావు అన్నారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై, ఓ ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పల్లా పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబం నైతిక విలువలతో కూడిన కుటుంబమని.. వారేమిటో ప్రజలందరికీ తెలుసని ఆయన చెప్పారు. బాక్సైట్ విషయంలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే వ్యక్తి చంద్రబాబు అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు.
ఇవీ చదవండి:
పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయిందిగా.!
'కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'