పెంపుడు కుక్క వల్ల పెళ్లి ఆగిపోయిందిగా.!
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:07 PM
కుక్క అరుపుతో పెళ్లి ఆగిపోయిన వింత ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది. పెళ్లి మండపంలోకి శునకాన్ని తీసుకురావడాన్ని వరుడి తరఫువారు అభ్యంతరం తెలపడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో పెళ్లి వేడుక కాస్తా రణరంగంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పీటలదాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడానికి కట్నకానుకల గొడవలు, వధూవరుల ప్రవర్తన, ఇతర సాకులే కానక్కర్లేదు. పెంపుడు జంతువుల వంటి చిన్న విషయాల వల్ల తలెత్తే వివాదాలూ ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. ఓ పెంపుడు శునకం పెట్టిన చిచ్చు వల్ల.. ఏకంగా పెళ్లి వేడుకే రద్దయింది. అంతటితో పోకుండా రక్తపాతానికీ దారితీసింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ ఘటన వివరాల్లోకెళితే...
ఫతేపుర్ జిల్లాలోని ఖాగా తహసీల్ ప్రాంతంలో ఈ నెల 20న ఓ వివాహం జరగబోతోంది. వధువు ప్రాణంగా పెంచుకున్న శునకం పెళ్లి వేదికపైకి వచ్చింది. ఇంతలో ఆ కుక్క ఒక్కసారిగా అరిచింది. పెళ్లికొడకు తరఫువారు ఆ కుక్కను మండపం లోపలికి తీసుకురావడంపై అభ్యంతరం తెలిపారు. దాన్ని దూరంగా ఉంచాలని వారు పట్టుబట్టారు. వధువు కుటుంబం ఇందుకు నిరాకరించింది. దీంతో వధువు, వరుడి కుటుంబ సభ్యుల మధ్య తగాదా పెరిగింది. చిన్నగా మొదలైన వాగ్వాదం మరింత ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇరు కుటుంబాల వారు పరస్పరం కర్రలు, కుర్చీలతో తీవ్ర గాయాలయ్యేలా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి గాయాలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుభం జరగాల్సిన పెళ్లి వేడుక కాస్తా అరుపులు, కేకలతో రణరంగంగా మారిపోవడంతో అతిథులంతా విస్మయానికి గురయ్యారు.
ఈ వివాదం తీవ్రం కావడంతో చివరకు ఇరు కుటుంబాలు రాజీకి నిరాకరించాయి. శునకం విషయంలో ఇంతటి వివాదం చెలరేగిన తర్వాత ఈ సంబంధం కొనసాగించడం ఇష్టంలేదని ఇరుపక్షాలు వివాహాన్ని రద్దు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పెళ్లిపీటల వరకు వెళ్లాక ఇలాంటి పరిస్థితులు రావడం బాధాకరమే. ఇలాంటి సందర్భాల్లో ఒత్తిడికి లోనుకాకుండా.. కుటుంబ సభ్యులతో మాట్లాడి, అవసరమైతే న్యాయపరమైన సలహాలు తీసుకోవడం లేదా సానుకూల పరిష్కారం కోసం ప్రయత్నించడం మంచిది.
ఇవీ చదవండి:
పోలీసుల బొలెరోను ఢీకొట్టిన ట్రక్కు.. ఐదుగురి మృతి
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్ట్