'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'
ABN , Publish Date - Feb 21 , 2026 | 03:58 PM
భారతదేశం మధుర స్మృతులకు నిలయమని ఓ ఆస్ట్రేలియన్ వ్లాగర్ చెప్పుకొచ్చారు. ఇటీవల దేశంలో కొన్ని నెలలపాటు నివసించిన ఆయన.. ఇక్కడి ఎన్నో ప్రదేశాలను సందర్శించి తన అనుభవాల్ని నెట్టింట పంచుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఎందరో విదేశీయులు భారతదేశ ఖ్యాతిని గురించి తమదైన శైలిలో రాసుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ ప్రస్తుతం అనేక రంగాల్లో దూసుకుపోతోంది. ఎందరో విదేశీయులు మన దేశంలో పర్యటించి వారి అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఓ ఆస్ట్రేలియన్ వ్లాగర్ ఇటీవల కొన్ని నెలలపాటు భారత్‌లో నివసించి తన అనుభవాలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చిరస్మరణీయ క్షణాలను ఇందులో ఎంచక్కా వివరించారు వ్లాగర్ డంకన్. భారత్.. ప్రతిఒక్కరూ సందర్శించాల్సిన నంబర్ వన్ ప్రదేశమని కొనియాడారు. ఎందుకంటే ఈ దేశంలో మంచు పర్వతాలు, ఇసుక ఎడారులు, బీచ్‌లు, అరణ్యాలు, జలపాతాలు వంటివెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి తోడు మంచి రుచికరమైన ఆహార పదార్థాలు, చక్కటి సౌకర్యాలు చవకగా లభిస్తాయని చెప్పుకొచ్చారు.
'భారత ప్రజలు సందర్శకుల్ని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఆ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఊహకందని క్రేజీ పండుగలు, వినోదాలెన్నో మనకు మధుర స్మృతులనిస్తాయి. మీరు ఏదైనా దేశాన్ని సందర్శించాలి అనుకుంటే.. తప్పకుండా భారత్‌కు వెళ్లండి. ఇది మీకు మునుపెన్నడూ లేని మంచి దృక్పథాన్ని అందిస్తుంది' అని డంకన్ అన్నారు.
డంకన్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులెందరో భారత్ గురించి తమ తమ అనుభవాలను నెట్టింట పంచుకున్నారు. డంకన్ అభిప్రాయాలను గౌరవిస్తూ తమ జ్ఞాపకాలను కామెంట్స్ రూపంలో రాసుకొచ్చారు. 'ఏళ్ల తరబడి అమెరికాలో నివసిస్తున్నాను. ఒకసారి భారత్‌ను సందర్శించగా.. చక్కటి అనుభూతి పొందాను. జీవితం ఎల్లప్పుడూ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుందని అప్పుడే నాకు తెలిసింది' అని ఓ నెటిజన్ పేర్కొన్నారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. 'నేను పాకిస్థాన్ నుంచి వచ్చాను. డంకన్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. భారతదేశం ఎంతో అందమైనది' అని చెప్పారు. 'భారత్ ఓ పెద్ద దేశం. ఇందులో పది దేశాలు కలిసినట్టుగా ఉంటుంది' అని ఒకరు; 'అందుకే మేం దీనిని ఇంక్రెడిబుల్ ఇండియా' అంటామని ఇంకొకరు తమదైన అభిప్రాయాలను తెలియజేశారు. 'భారతదేశం కూడా ఓ పూర్తి ఖండం' అని మరో వ్యక్తి వ్యాఖ్యానించాడు.
డంకన్ గతంలోనూ ఇలాంటి వీడియోలెన్నో చేశారు. భారత్‌పై పాశ్చాత్య దేశాల్లో అనేక తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయని.. వీటిని సరిదిద్దాల్సిన అవసరముందని చెప్పారు. భారత్ వాస్తవానికి అనేక సంస్కృతులతో విలసిల్లే అందమైన దేశమని ఇక్కడి జనాలు అద్భుతమని ఆయన ఓ వీడియోలో కామెంట్ చేశారు. ఏది ఏమైనా భారతదేశ సందర్శనను విదేశీయులు ఎంత భిన్నంగా అనుభవిస్తున్నారనే విషయం డంకన్ తాజా వీడియో ద్వారా స్పష్టమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవీ చదవండి:
శభాష్ చిన్నారీ.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న పిల్లలను ఎలా కాపాడిందో చూడండి..
బరువు తగ్గడం కోసం వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న చైనీయులు..