ప్రపంచ డిజిటల్ ఎకానమీలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలి.. లోకేశ్ పిలుపు
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:41 PM
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం.. నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
విశాఖపట్నం, ఆగస్టు 5: ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం(IBM) నూతన ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డిజిటల్ సేవలు, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా విశాఖపట్నం ఆవిర్భవించడాన్ని ఐబీఎం ఫ్యూచర్‌నౌ సెంటర్ తోడ్పాటును అందిస్తోందన్నారు.

సాంకేతిక పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నాణ్యమైన ఉపాధిని సృష్టించడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడం, ఏపీ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేలా చేసే ఒక సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల ఐబీఎం చూపుతున్న నిరంతర నిబద్ధతను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఏఐ, డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం విశాఖపట్నాన్ని భారతదేశంలోని అగ్రగామి కేంద్రాలలో ఒకటిగా తీర్చిదిద్దడానికి ఐబీఎంతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా..
ప్రపంచవ్యాప్తంగా కన్సల్టింగ్ సేవలు, ఏఐ(AI) ఫస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టులకు మద్దతుగా ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశ సాంకేతిక ఆవిష్కరణలు, ప్రతిభావంతులైన మానవ వనరుల అభివృద్ధిపై సంస్థ కొనసాగిస్తున్న పెట్టుబడులకు ఇది మరో కీలక ముందడుగు కానుంది. ఈ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులకు కన్సల్టింగ్, సాంకేతిక సేవలను అందించనుంది. ఇందులో కృత్రిమ మేధస్సు (AI), హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా అండ్ అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి కీలక రంగాల్లో సేవలు అందించనున్నారు. అదేవిధంగా ఏఐ ఆధారిత క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ప్లాట్‌ఫార్మ్ ఇంజనీరింగ్, సర్వీస్ ఇంటిగ్రేషన్, క్వాలిటీ ఇంజనీరింగ్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ సేవలకు ఐబీఎం కన్సల్టింగ్ ఫ్యూచర్‌నౌ సెంటర్ ప్రధాన కేంద్రంగా పనిచేయనుంది.


ఇవి కూడా చదవండి...
దేశంలో ఎక్కడా బీసీల కోసం ప్రత్యేక చట్టం లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
ఎల్‌నినో ఎఫెక్ట్.. 2027 వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలి: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telugu News