Share News

నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు

ABN , Publish Date - Aug 05 , 2026 | 12:41 PM

ఆగస్టు 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశం అజెండాపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను సమీక్షించాలని GRMB సమావేశ అజెండాలో చేర్చారని అన్నారు.

నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్ రావు
Harish Rao

హైదరాబాద్, ఆగస్టు 5: ఈనెల(ఆగస్టు) 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(GRMB) సమావేశం అజెండాపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను సమీక్షించాలని GRMB సమావేశ అజెండాలో చేర్చారని ఆరోపించారు. అజెండా వచ్చి వారం రోజులు గడిచినా ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు. ఏడు ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం అడిగితే అజెండాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఏపీ కోసమే GRMB అజెండా ఉన్నట్లు కనిపిస్తోందని ఆరోపణలు గుప్పించారు.


తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ ఇటీవల తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని హరీశ్ తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు తీసుకురాలేదని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.


తెలంగాణకు తాగు, సాగునీరు దూరం చేసే కుట్ర జరుగుతోందని హరీశ్ ఆరోపించారు. రాష్ట్రానికి ద్రోహం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. గురు దక్షిణ చెల్లించడం కోసం రేవంత్ మౌనంగా ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వం ఉందని విమర్శించారు. నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదని హెచ్చరించారు. కాళేశ్వరం అనుమతులు రద్దు చేయడమంటే సగం తెలంగాణకు అన్యాయం చేయడమే అని వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాలను కూడా సరిగా వాడటం లేదని మాజీ మంత్రి విమర్శించారు. గోదావరిపై ఉన్న నీళ్లను ఎత్తిపోయడం లేదన్నారు. తెచ్చిన అనుమతులు కూడా ఇప్పుడు రద్దయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. సమ్మక్క బ్యారేజీకి అనుమతి ఇవ్వొద్దని ఏపీ చెబితే GRMBలో పెట్టారని మండిపడ్డారు. బనకచర్ల, మల్లన్నసాగర్ కడతారు కానీ.. సమ్మక్క బ్యారేజీ ఎందుకు వద్దని హరీశ్ రావు ప్రశ్నించారు.


ఇవి కూడా చదవండి...

రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

ఆర్‌ఎస్‌ ప్రవీణ్.. కల్వకుంట్ల కుటుంబానికి ఊడిగం చేస్తున్నారు: సంపత్ కుమార్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2026 | 01:10 PM