ఎల్‌నినో ఎఫెక్ట్.. 2027 వరకు శ్రీశైలం జలాలను భద్రపరుచుకోవాలి: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:15 PM
రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు.
అమరావతి, ఆగస్టు 5: రాయలసీమ తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎల్‌నినో నేపథ్యంలో 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను తాగునీటి కోసం భద్రపరచుకోవాలని అన్నారు. నేటికి శ్రీశైలం వద్ద ఉన్న 119 టీఎంసీలకు తోడు, రాబోయే 10 రోజులలో మరొక 100 టీఎంసీల వరకు ఇన్ ఫ్లో రావచ్చని అంచనా వేస్తున్నామన్నారు. కృష్ణా జలాల్లో ఏపీ 63 శాతం వాటాను ప్రథమంగా తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నీటిని ఎల్‌నినో దృష్ట్యా ప్రథమ ప్రాధాన్యంగా తాగునీటికి విడుదల చేస్తున్నామని తెలిపారు.
హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి అవసరాల కోసం 13 టీఎంసీలు అవసరమని మంత్రి వెల్లడించారు. పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం10 టీఎంసీలను రేపటి నుంచి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అలాగే, తెలుగుగంగ ద్వారా చెన్నై తాగునీటికై 10 టీఎంసీల నీరు విడుదల చేయాల్సి ఉందన్నారు. నాగార్జున సాగర్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పరిధి తాగునీటికి 32 టీఎంసీలు అవసరమన్నారు. వారం, వారం సమీక్ష చేసుకుని ఎల్‌నినో విపత్తును ఎదుర్కొనే విధంగా వర్షాలు, వరదల ఆధారంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ నీటి భద్రతకు చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి...
ప్రకాశం జిల్లా అభివృద్ధికి REMZ ప్రాజెక్ట్ కీలకం: గొట్టిపాటి రవికుమార్
దేశంలో ఎక్కడా బీసీల కోసం ప్రత్యేక చట్టం లేదు: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News