విశాఖలో భారీ వర్షం.. అప్రమత్తమైన యంత్రాంగం
ABN , Publish Date - Sep 23 , 2026 | 05:29 PM
విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతోపాటు జీవీఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విశాఖపట్నం, సెప్టెంబర్ 23: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికారులతోపాటు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో కొండవాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం కైలాస పురం కస్తూరి నగర్‌లో కొండ చరియలు జారి పడిన ప్రాంతాన్ని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్‌తో కలిసి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పరిశీలించారు.
అనంతరం కస్తూరి నగర్‌లోని 8 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు వారు ఆదేశించారు. అలాగే సాయి నగర్, వాంబే కాలనీ, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ముందస్తు భద్రతా చర్యలపై వారు సమీక్షించారు. అలాగే జీవీఎంసీ సిటీ ఆపరేషన్స్ సెంటర్‌ను వారు సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలో 56 ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అత్యవసర సహాయక చర్యలకు 22 జేసీబీలు, 149 టిప్పర్లు/టాటా ఏస్‌లు, 30 మినీ ఎక్స్‌కవేటర్లను అధికారులు సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి..
మొదటి విడతగా 24 వేల మంది పేదలకు పట్టాల పంపిణీ: ఎంపీ కేశినేని చిన్ని
సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. సుప్రీంకోర్టులో కీలక పరిణామం
Read Latest AP News And Telugu News