ఏపీ రిజర్వాయర్లలో 10 శాతం నీరు పరిశ్రమలకు కేటాయింపు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:47 PM
పారిశ్రామిక అభివృద్ధికి నీటి భద్రత అత్యంత కీలకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర రిజర్వాయర్ నిల్వల్లో 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం, నవంబర్12: పారిశ్రామిక అభివృద్ధికి నీటి భద్రత అత్యంత కీలకమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర రిజర్వాయర్ నిల్వల్లో 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తున్నామని తెలిపారు. గురువారం విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ సదస్సులో ఆయన మాట్లాడారు. నీటి సంరక్షణ, స్మార్ట్ ఇరిగేషన్, నీటి శుద్ధి, రీసైక్లింగ్, డిజిటల్ వాటర్ మేనేజ్మెంట్లో పరిశ్రమలు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వంతో కలిసి వినూత్న జలవనరుల పరిష్కారాలను అభివృద్ధి చేయాలని పారిశ్రామిక సమాఖ్యకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
రాష్ట్రంలో 5 ప్రధాన నదులు, 35 మధ్య తరహా, చిన్న నదులు, 114 రిజర్వాయర్లు ఉన్నాయని మంత్రి నిమ్మల వివరించారు. 38 వేలకుపైగా చిన్న నీటిపారుదల చెరువులు, 19 లక్షలకు పైగా వ్యవసాయ బోరు బావులు రాష్ట్ర జలసంపదకు నిదర్శనమని చెప్పారు. మిగులు జలాలున్న ప్రాంతాల నుంచి, కరువు పీడిత ప్రాంతాలకు నీటిని తరలించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. నదుల అనుసంధానానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శ్రీకారం చుడితే, దానిని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో పట్టిసీమ ద్వారా గోదావరి – కృష్ణా నదుల అనుసంధానం సాకారం చేశారని మంత్రి నిమ్మల తెలిపారు. రూ.1,600 కోట్లతో రికార్డు సమయంలో పూర్తయిన పట్టిసీమ ప్రాజెక్టు, 12 ఏళ్లలో రూ.లక్ష కోట్లకుపైగా సంపద సృష్టించిందని చెప్పారు. ఇప్పటి వరకు 500 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించామని అన్నారు. ఎల్‌నినో వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టా వ్యవసాయాన్ని కాపాడిన ఘనత పట్టిసీమదేనని వెల్లడించారు. శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరం, 751 మీటర్ల ఎత్తుకు 72 లిఫ్ట్‌ల ద్వారా హంద్రీ – నీవా నీటిని తరలించామని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణతో కేవలం ఏడాది రికార్డు సమయంలో హంద్రీ–నీవా పనులు పూర్తి చేశామని మంత్రి నిమ్మల తెలిపారు. హంద్రీ - నీవా ద్వారా కియా సహా రాయలసీమ పారిశ్రామిక క్లస్టర్లకు నీటి భద్రత కల్పిస్తున్నామని వివరించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాల తరలించామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రోజువారీ పర్యవేక్షణతోనే, రెండేళ్లలోపే అనకాపల్లి, విశాఖపట్నంకు గోదావరి జలాల తరలింపు సాధ్యమైందని చెప్పారు.
2027 నాటికి బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం ద్వారా 17,500 క్యూసెక్కుల నీటిని ఉత్తరాంధ్రకు తరలిస్తామని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్, పరిశ్రమలు, డేటా సెంటర్లు, తాగునీటి అవసరాలకు పోలవరం నీటి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలిస్తామని చెప్పారు. కృష్ణా జలాల ఆదాతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీటి భద్రత కల్గుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
గోదావరి - ఏలేరు, కృష్ణా - పెన్నా నదుల అనుసంధానాలను ఇప్పటికే పూర్తి చేశామని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. పోలవరం - బనకచర్ల, పోలవరం - చంపావతి, వంశధార - నాగావళి, నాగావళి - చంపావతి అనుసంధానాలు తమ తదుపరి ప్రాధాన్యతగా నిర్ణయించామని ప్రకటించారు. భూగర్భ జలాల రీఛార్జ్‌కు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. భూగర్భ జలమట్టం ప్రతి మీటరు పెరిగితే, సుమారు 99 టీఎంసీల నీటి నిల్వ పెరుగుతుందని వివరించారు. ప్రతి నీటి బొట్టును భూగర్భంలోకి చేర్చి భూగర్భ జలాలనే భారీ రిజర్వాయర్లుగా మార్చే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు.
1,700 పీజోమీటర్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలపై రియల్ టైమ్ పర్యవేక్షణ చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వర్షాకాలం తర్వాత భూగర్భ జలమట్టాన్ని 3 మీటర్లకు, వర్షాకాలానికి ముందు 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 'జలధార – జలహారతి' ద్వారా నీటి సంరక్షణ, జలాశయాల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు వివరించారు. చెరువులు, జలాశయాల అభివృద్ధితో భూగర్భ జలాల రీఛార్జ్‌లో గణనీయమైన మెరుగుదల కనిపించిందని సంతోషం వ్యక్తం చేశారు. నదుల అనుసంధానం, ప్రతి నీటి బొట్టు సంరక్షణతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సురక్షితం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా ఆత్మకథపై పి. వి. నరసింహరావు మనవడు తీవ్ర విమర్శలు
నాగుల చవితి ఎప్పుడూ .. ఆ రోజు ఏం చేయాలి
For More AP News And Telugu News