Share News

BEST HEADLINE: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

ABN , Publish Date - Oct 04 , 2026 | 03:28 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ‘స్టే’ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది.

BEST HEADLINE: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

  • రిజర్వేషన్‌ పరిమితి లక్ష్మణరేఖ కాదు

  • బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ‘స్టే’ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. గ్రామ పంచాయతీల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో శనివారం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించరాదంటూ 2020 నాటి బిర్రు ప్రతాప్‌రెడ్డి కేసు తీర్పును ఆధారంగా చేసుకుని జీవోలు 105, 1065 చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని పేర్కొంది. నాటి పరిస్థితులతో ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని పోల్చడం సమంజసం కాదని తెలిపింది.. రాజ్యాంగంలోని 243డీ(6), 243టీ(6) అధికరణల కింద రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జనహిత్‌ అభియాన్‌ కేసులో పేర్కొన్నట్లుగా 50 శాతం రిజర్వేషన్‌ పరిమితి ఎల్లప్పుడూ ఉల్లంఘించలేని, మార్చలేని లక్ష్మణరేఖేమీ కాదని పేర్కొంది. పంచాయతీ రాజ్‌ సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 61.08 శాతం ఉన్నప్పటికీ, పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం వర్టికల్‌ రిజర్వేషన్లు 49.24 శాతం మాత్రమే ఉన్నాయని పేర్కొంది. హైకోర్టు తీర్పు వల్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని, తద్వారా ఆర్థిక సంఘం నిధులు సైతం ఆగిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 03:28 AM