పర్యాటక కేంద్రంగా యారాడ
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:34 AM
యారాడను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎదురుగా ఉన్న కొండపై 350 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కొండపై 350 ఎకరాల్లో ఐటీ హబ్
యారాడ నుంచి వన్‌టౌన్‌కు వంతెన నిర్మిస్తాం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, పల్లా శ్రీనివాసరావు
మల్కాపురం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
యారాడను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఎదురుగా ఉన్న కొండపై 350 ఎకరాల్లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం వారు యారాడ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యారాడ గ్రామం నుంచి వన్‌టౌన్ వరకు వంతెనతో పాటు కనెక్టివిటీ రోడ్డును నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కొంతమంది ముస్లింలు కోర్టులో కేసు వేసినందున ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిందని, త్వరలో వారితో మాట్లాడి సమస్యను పరిష్కారిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగిపోయిన ఎల్‌పీసీలను త్వరగా అందేలా చూస్తామన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి అరటితోటలు నేలకూలినందున సదరు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వారి వెంట పలువురు అధికారులు ఉన్నారు.
రాయితీపై ఉల్లి విక్రయాలు ప్రారంభం
ఒక్కొక్కరికి రెండేసి కిలోలు
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని 15 రైతుబజార్లలో రాయితీ ఉల్లి విక్రయాలు శనివారం ప్రారంభమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.55 ఉండగా రాయితీపై కిలో రూ.35కే విక్రయించారు. స్థానిక ఎమ్మెల్యేలు ఆయా బజార్లకు వెళ్లి కొనుగోలుదారులకు ఉల్లిని అందించారు. పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖలు సంయుక్తంగా మనిషికి రెండు కిలోలు చొప్పున ఇస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలిపారు. ఉల్లి కోసం ఆధార్ నంబరు చెప్పాలని అది యాప్‌లో నమోదు చేసుకున్నాక ఇస్తారన్నారు. మధురవాడలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎంవీపీ కాలనీలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నరసింహనగర్‌లో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పశ్చిమలో ఎమ్మెల్యే గణబాబు, పెందుర్తిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు విక్రయాలు ప్రారంభించారు. రాయితీ ఉల్లిని ఒకసారి తీసుకుంటే మళ్లీ వారం వరకు ఆ వ్యక్తులకు ఇవ్వరని అధికారులు తెలిపారు.
తీరానికి విద్యార్థుల మృతదేహాలు
శోకసంద్రంలో తల్లిదండ్రులు
మధురవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
ఐటీ సెజ్ సమీపాన శుక్రవారం సముద్రంలో గల్లంతైన తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎస్.నితేష్, ఎస్.సూర్యప్రకాశరావుల మృతదేహాలు శనివారం అదే ప్రాంతంలో లభ్యమయ్యాయి. గజ ఈతగాళ్లు ఇద్దరి మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల రోదనలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది. సరదాగా బీచ్‌కు వెళతామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ గుండెలవిసేలా విలపించారు. నితేష్, సూర్యప్రకాశరావుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
సీఐఐ ప్రాంతీయ సదస్సుకు ఏర్పాట్లు
విశాఖపట్నం, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
గంభీరంలోని ఐఐఎంలో ఈ నెల ఏడో తేదీన నిర్వహించనున్న ప్రాంతీయ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. సదస్సుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, పరిశ్రమల ప్రతినిధులు సుమారు 500 మంది వరకు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు, ఆర్‌డీఓలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, డీఐసీ జీఎం ఆదిశేషు పాల్గొన్నారు.