నాణ్యత లేదని 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపిన టీటీడీ
ABN , Publish Date - Oct 04 , 2026 | 04:37 AM
తిరుమల శ్రీవారి ప్రసాదాల ముడిసరుకుల వినియోగంలో కూటమి ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు టెండరు నిబంధనల్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే సరుకులను వెనక్కి పంపిస్తున్నారు.
తిరుపతి నుంచి పార్వతీపురానికి.. నాణ్యతా ప్రమాణాలు లేకపోవడంతో
తిరస్కరించిన టీటీడీ అధికారులు
తిరుమల ల్యాబ్‌లో ముడిసరుకుల తనిఖీ
ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే వినియోగం
ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం వల్లే ‘రిజెక్ట్’!
గిరిజనుల పంట.. దళారులకు కాసుల వర్షం
పంపే ముందు నాణ్యతా పరీక్షలు జరగని వైనం!
పార్వతీపురం, తిరుపతి(టీటీడీ), అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ప్రసాదాల ముడిసరుకుల వినియోగంలో కూటమి ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరిస్తోంది. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు టెండరు నిబంధనల్లో పేర్కొన్న నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే సరుకులను వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ) నుంచి సేకరించిన సుమారు 12 టన్నుల జీడిపప్పును వెనక్కి పంపించారు. తద్వారా నాణ్యత సక్రమంగా లేకుంటే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్న సంకేతాలు పంపించినట్లైంది. టీటీడీలోని శ్రీవారి ప్రసాదాలతో పాటు అన్నప్రసాదాల కోసం అనేక ముడిసరుకుల కోసం టీటీడీ అధికారులు నిత్యం టెండర్లు పిలుస్తుంటారు. ఇటీవల జీసీసీ నుంచి సుమారు 12 టన్నుల జీడిపప్పును వివిధ అవసరాల కోసం వినియోగించేందుకు టీటీడీ గోడౌన్‌కు తీసుకువచ్చారు. తిరుమలలో సరుకులను వినియోగించే ముందు ప్రమాణాలకు అనుగుణంగా కచ్చితంగా ఉన్నాయా లేవా తెలుసుకునేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. వచ్చిన సరుకు నుంచి అధికారులు కొన్ని శాంపిల్స్ తీసుకువచ్చి తిరుమలలోని ల్యాబ్‌లో పరీక్షించారు. అవి టీటీడీ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల మేరకు లేవని గుర్తించారు. దీంతో జీడిపప్పును తిరిగి వెనక్కి పంపించారు.
అత్యాధునిక ల్యాబ్‌లో పరీక్షలు
కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చాక నాణ్యత విషయంలో ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం తిరుమలలోని ల్యాబ్‌కు బ్లాక్‌చైన్ సాంకేతిక పరిజ్ఙానాన్ని తీసుకురావాలని స్పష్టం చేశారు. దీంతో ఆలయ అవసరాల మేరకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ సహకారంతో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను మార్చిలో చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ సుమారు 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి నెలా సుమారు 1500 నమూనాలను పరీక్షించేందుకు ఇక్కడ అవకాశం ఉంది. కొవ్వు ఆమ్లాలు, పురుగుమందులు, వాయు వీయ పదార్థాల పరీక్షలు, మైక్రోటాక్సిన్లు, ఔషధాలు, యాడిటివ్‌లు ఇక్కడ పరీక్షించవచ్చు. పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని గుర్తించినట్లయితే పునఃపరిశీలన ఉండదు. అంత కచ్చితత్వంతో పరీక్షలు జరుగుతున్నాయి. జూన్ నుంచి పరీక్ష ఫలితాలు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో నాణ్యత పరీక్షల్లో పాస్ అయితేనే వాటిని శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తున్నారు.
మన్యంలో ప్రధాన పంట
పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రధాన పంటల్లో జీడి ఒకటి. పార్వతీపురం ఐటీఈఏ పరిధిలో 58,146 ఎకరాలు, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 46,408 ఎకరాల్లో జీడితోటలు ఉన్నాయి. వేలాదిమంది గిరిజన కుటుంబాలు ఈ సాగుపై ఆధారపడి ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పార్వతీపురంలో 18 నెలల క్రితం కోటి రూపాయలతో జీడి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. రైతుల నుంచి జీడిపిక్కలను కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి నాణ్యత ప్రమాణాలతో దేవస్థానాలకు సరఫరా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం గ్రామస్థాయిలో కొనుగోలు వ్యవస్థ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. అవసరమైన సరుకును రైతులు నుంచి నేరుగా సేకరించడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో అధికారులు వ్యాపారులను ఆశ్రయించారు. వ్యాపారులు నాణ్యతలేని జీడిపిక్కలను సరఫరా చేశారు. అధికారులు వీటిని ప్రాసెసింగ్ చేయించి టీటీడీకి పంపించారు.
తిరుమలకు పంపేముందు పరీక్షలపై సందేహాలు
టీటీడీకి సరఫరా చేసే జీడిపప్పు నిర్దిష్ట నాణ్యత కలిగి ఉండాలి. పప్పు పరిమాణంతో పాటు గ్రేడింగ్, అలాగే తేమ, జీడిబద్ద, జీడిముక్క ఇలా అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే సరుకులు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో పార్వతీపురం నుంచి తిరుమలకు సరుకు పంపే ముందు స్థానికంగా నాణ్యత పరీక్ష నిర్వహించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక సెలవు రోజు ఐటీడీఏ అధికారులు రహస్యంగా ఇక్కడి నుంచి జీడిపప్పు పంపించారని తెలుస్తోంది. తిరుమలలో జరిగిన నాణ్యతా పరీక్షల్లో సరుకు తిరస్కరణకు గురైందని చెబుతున్నప్పటికీ ఏ కారణం అన్నది తెలియరాలేదు.
రైతుల నుంచి వ్యాపారుల కొనుగోలు
రెండు ఐటీడీఏల పరిధిలోని గిరిజన రైతులు పండించే జీడిపప్పు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు అడ్వాన్స్‌ల రూపంలో నగదు ఇస్తున్నారు. రైతుల అవసరాలను వ్యాపారులు అవకాశాలుగా మార్చుకుంటూ దోచుకుంటున్నారు. తర్వాత తాము అడ్వాన్స్‌లు ఇచ్చిన రైతుల నుంచి సరుకు తీసుకుంటున్నారు. దీనివల్ల జీడిపిక్కలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్‌దన్ వికాస్ యోజన కేంద్రాలు నిర్వీర్యమై పోతున్నాయి.
రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలి
మన్యం జీడికి స్థిరమైన మార్కెట్ కల్పించాలంటే రైతుల నుంచి నేరుగా జీడి పిక్కలను కొనుగోలు చేయాలి. గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాల బలోపేతంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు చేస్తే వారు వ్యాపారులపై ఆధారపడే అవకాశం ఉండదు. తమకు ఆ సహకారం ఉంటే వ్యాపారులకు తాము ఎందుకు జీడిపిక్కలను తక్కువ ధరకు అమ్ముకుంటామని అనేక మంది గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రైతులకు కోత అనంతరం నిర్వహణ, ఎండబెట్టడం, గ్రేడింగ్‌పై శిక్షణ ఇవ్వాల్సిఉంది. కొనుగోలు చేసిన సరుకును ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపే ముందు నాణ్యతను పరీక్షించే వ్యవస్థను కూడా బలోపేతం చేయాలి.
ఆదిలోనే ఎదురుదెబ్బ
మన్యం జీడిపప్పును తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి సరఫరా చేయాలన్న ప్రయత్నానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీకి పంపించిన జీడిపప్పు తిరిగి వచ్చిన మాట వాస్తవమేనని పార్వతీపురం ఐటీడీఏ ఏపీవో మురళీధర్ చెప్పారు. రైతుల నుంచి నేరుగా సేకరించాల్సిన జీడిపప్పును వ్యాపారుల నుంచి సేకరించడం, పంపేముందు నాణ్యత పరీక్షలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణాలుగా తెలుస్తోంది. ఈ సరుకును అధికారులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇప్పటికే మూడు టన్నులు విక్రయించినట్టు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి: