Share News

భర్త వేధింపులు తాళలేక..

ABN , Publish Date - May 04 , 2026 | 12:05 AM

మండలంలోని ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) అనే వివాహిత శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది.

  భర్త వేధింపులు తాళలేక..
రాజేశ్వరి (ఫైల్‌)

-కన్నవారింట్లో వివాహిత ఆత్మహత్య

జి.సిగడాం, మే 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆనందపురంలో కిమిడి రాజేశ్వరి (26) అనే వివాహిత శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆనందపురానికి చెందిన రాజేశ్వరికి విశాఖపట్నం పెద్ద వాల్తేరు జాలారుపేటలో నివాసం ఉంటున్న కిమిడి శ్యామలరావుకు 2019 జూన్‌ 26న వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప అన్విత, 18 నెలల బాబు జశ్వన్‌ ఉన్నారు. శ్యామలరావు మద్యం, బెట్టింగ్‌కు బానిసై రాజేశ్వరి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టాడు. వ్యసనాలకు బానిసై తరచూ రాజేశ్వరిని వేధించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. రాజేశ్వరి తండ్రి సూర్యారావు ఎన్నిసార్లు చెప్పినా శ్యామలరావు వినేవాడు కాదు. దీంతో తనతో జీవించలేనని చెప్పి రాజేశ్వరి వారం రోజుల కిందట కన్నవారి గ్రామం ఆనందపురానికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం వేకువజామున మనుమడు ఏడుస్తుండడంతో గదిలోకి వెళ్లి చూడగా కుమార్తె సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడి ఉండడంతో తల్లిదండ్రులు సూర్యారావు, యశోదలు ఆందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. జేఆర్‌పురం సీఐ అవతారం, లావేరు ఎస్‌ఐ అప్పలసూరి, జి.సిగడాం ఏఎస్‌ఐ కె.రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 12:05 AM