కొత్త రైల్వే జోన్.. ఇకపై మన సమస్యలు మనమే తీర్చుకోగలం: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Jun 01 , 2026 | 01:56 PM
విశాఖ జోన్ కోసం పార్లమెంట్‌లో అనేక పర్యాయాలు పోరాడానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు.
శ్రీకాకుళం, జూన్ 1: విశాఖ జోన్ కోసం పార్లమెంట్‌లో అనేక పర్యాయాలు పోరాడానని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. రైల్వే జోన్ సాధన కోసం ఆ రోజుల్లో ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌లో దీక్ష చేపట్టినట్లు గుర్తుచేశారు. నేడు కేంద్ర మంత్రిగా ఉండి దక్షిణ కోస్తా రైల్వే జోన్ సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన ప్రారంభమైందన్నారు. ‘కొత్త రైల్వేజోన్ ద్వారా ఇక నుంచి మన సమస్యలను మనం తీర్చుకోగలం’ అని తెలిపారు.
ఇచ్చాపురం మండలం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం ఏ.ఏస్ పేట వద్ద సౌత్ కోస్ట్ రైల్వేజోన్ స్వాగత బోర్డ్‌ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ ఈరోజు(సోమవారం) ఆవిష్కరించారు. కొబ్బరికాయ కొట్టి, జోన్ ప్రారంభోత్సవానికి గుర్తుగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ.. ‘గతంలో స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు కృషి చేశారు. 12 సంవత్సరాలుగా నా భుజాలపైన సమస్యను వేసుకొని పోరాడి రైల్వే జోన్‌ను సాధించా’ అని చెప్పారు. ఈ సరికొత్త రైల్వే జోన్ ప్రారంభం నేపథ్యంలో తెలుగు ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే బలమైన లీడర్ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో నిధుల విడుదల: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Read Latest AP News And Telugu News