Share News

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు

ABN , Publish Date - Jun 05 , 2026 | 10:59 AM

పర్యావరణ ప్రభావం మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం మీద ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు
Rammohan Naidu

శ్రీకాకుళం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణమన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(శుక్రవారం) స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ... పర్యావరణ ప్రభావం మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం మీద ఉంటుందన్నారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు.


ప్రధాని మోదీ గత 12 సంవత్సరాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధానిని ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్ కొనసాగుతోందన్నారు. మోదీ చేపట్టిన స్వచ్ఛభారత్‌ను ఆదర్శంగా తీసుకుని సీఎం చంద్రబాబు స్వచ్ఛఆంధ్రా కార్యక్రమం చేపట్టారని చెప్పారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని పిల్లలకు కూడా అలవాటు చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 15 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.


కాలుష్య నివారణ, ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారని రామ్మోహన్ తెలిపారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. ఇటీవల 24 లక్షల మంది హైబ్రిడ్ విధానంలో పాల్గొని మహానాడు విజయవంతం చేయడం ఇంధన పొదుపు చర్యలకు ఒక అద్భుతమైన మోడల్ అని చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్‌ రహిత ఆంధ్రాగా మారుద్దామన్నారు. ప్లాస్టిక్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో 59 పాఠశాలలను నెట్ జీరో స్కూల్స్‌గా తీర్చిదిద్ది.. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించామన్నారు. శ్రీకాకుళం పట్టణంలో రూ.కోటి వ్యయంతో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ బోర్డును కేంద్రమంత్రి ఆవిష్కరించారు. ప్రకృతి పరిరక్షణకు ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సైకిల్ తొక్కడమనేది ఇంధన పొదుపు మాత్రమే కాదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

భవిష్యత్తులో వర్షాలు వచ్చే పరిస్థితి లేదు.. నీటిని ఆదా చేయండి: మంత్రి పొన్నం ప్రభాకర్

పర్యావరణ దినోత్సవం.. తిరుమలలో మొక్క నాటిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 05 , 2026 | 11:46 AM