రెండు నెలలుగా వేతనాల్లేవ్
ABN , Publish Date - May 08 , 2026 | 12:29 AM
అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిత్యాలయంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో తమకు ఆకలి బాధలు తప్పడం లేదని దినసరి వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకలితో పనిచేసేదెలా?
ఆదిత్యాలయంలో దినసరి ఉద్యోగుల ఆవేద న
కాంట్రాక్టరు ఇష్టారాజ్యంతో ఇబ్బందులు
అధికారుల ఆదేశాలు సైతం బేఖాతరు
అరసవల్లి, మే 7(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదిత్యాలయంలో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో తమకు ఆకలి బాధలు తప్పడం లేదని దినసరి వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిమెంట్ కాపీ ఇవ్వాలని, వేతనాలతోపాటు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌లు సక్రమంగా చెల్లించాలని ఆలయ అధికారులు నోటీసులు జారీచేసినా.. కాంట్రాక్టర్ బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వేతనాలు అందక పస్తులుంటున్నామని, తమను ఆదుకోవాలని ఇటీవల ఈవోను వేడుకున్నారు.
నిబంధనల మేరకు కాంట్రాక్టరు ఆన్‌లైన్‌లో విధానంలో ఈఎస్‌ఐ, ఈపీఎఫ్, వేతనాలు చెల్లించాలి. కానీ అందుకు విరుద్ధంగా జనవరి, ఫిబ్రవరి నెలల వేతనాలు నేరుగా ఉద్యోగుల చేతికి అందించాడు. ఇది సరికాదని.. ఆన్‌లైన్ చెల్లింపుల రసీదుల కాపీలు అందజేయాలని ఈవో సదరు కాంట్రాక్టరు ప్రతినిధికి తెలిపారు. అలాగే టెండరు అగ్రిమెంట్ సైతం ఇవ్వకపోవడంతో ఈవో ఆయనను మందలించి, వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. అయినా కాంట్రాక్టరు స్పందించకపోవడంతో మళ్లీ ఏప్రిల్ మొదటి వారంలో పిలిచి.. మార్చి నెల వేతనాల బిల్లు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. అయినా నిమ్మకునీరెత్తినట్టు ప్రవర్తించడంతో మళ్లీ గత నెల 15న కార్యాలయానికి పిలిచి మందలించారు. అయినా సరే ఇంతవరకు కాంట్రాక్టరు ప్రవర్తనలో మార్పు లేకపోవడం గమనార్హం. నియోజకవర్గానికి చెందిన అధికారపార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు వేతనదారులు సిద్ధమవుతున్నారు.
కాంట్రాక్టరు బిల్లు పెట్టడం లేదు - కేఎన్‌వీడీవీ ప్రసాద్, ఈవో, అరసవల్లి
ఆలయంలో సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు అందక ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కాంట్రాక్టరు అగ్రిమెంట్ కాపీ కూడా ఇవ్వడం లేదు. ఆన్‌లైన్‌లో జీతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ ఖచ్చితంగా చెల్లించాలని చెప్పాం. ప్రతీ నెల చివరి తేదీన బిల్లు పెడితే వెంటనే చెల్లిస్తాం. ఈ విషయమై కాంట్రాక్టర్ నోటీసు కూడా ఇచ్చాం. జీతాల బిల్లు పెట్టిన వెంటనే చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.