Share News

నీట్‌కు 47 మంది గైర్హాజరు

ABN , Publish Date - May 04 , 2026 | 12:16 AM

Neet exam at srikakulam ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయర్వేదం వైద్యవిద్యలో చేరేందుకు దేశవాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది.

నీట్‌కు 47 మంది గైర్హాజరు
దివ్యాంగ విద్యార్థిని భుజంపై మోసుకెళ్తున్నకానిస్టేబుల్‌ టి.జగదీష్‌కుమార్‌

  • పెద్దపాడులో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న ఇద్దరు విద్యార్థినులు

  • బతిమిలాడినా.. లోపలకి అనుమతించని అధికారులు

  • శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివ్యాంగ విద్యార్థికి.. పోలీసు చేయూత

  • నరసన్నపేట / శ్రీకాకుళం రూరల్‌/ గుజరాతీపేట, కలెక్టరేట్‌, మే 3(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయర్వేదం వైద్యవిద్యలో చేరేందుకు దేశవాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,951 మంది విద్యార్థులకుగాను 1,904 మంది హాజరయ్యారు. 47 మంది గైర్హాజరయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 223 మందికి గాను 216 మంది, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 624 మందికిగాను 611 మంది హాజరయ్యారు. పెద్దపాడులోని కేంద్రీయ విద్యాలయంలో 384 మందికిగాను 375 మంది, ఎచ్చెర్లలోని ఆర్జీయూకేటీ కేంద్రంలో 720 మందివిద్యార్థులకుగాను 702 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకూ పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. నిబంధనల మేరకు విద్యార్థులను తనిఖీ చేశారు. ఎలక్ర్టానిక్‌, మెటల్‌ వస్తువులు లేకుండా ఉండేలా స్కానింగ్‌ చేసి.. పరిశీలించిన అనంతరం పరీక్షా కేంద్రం లోపలకు విడిచిపెట్టారు.

  • కలెక్టర్‌ పరిశీలన

  • శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పరిశీలించారు. అభ్యర్థులకు నిర్వహిస్తున్న బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని పరిశీలించారు. అభ్యర్థులకు తాగునీరు, మౌలిక వసతులతోపాటు పరీక్షా కేంద్రంలో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ హారిఓం పాండియ, ఆర్డీవో కె.సాయిప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

  • కాళ్లు పట్టుకుంటాం సార్‌.. అనుమతించండి

  • శ్రీకాకుళం మండలం పెద్దపాడులోని కేంద్రీయ విద్యాలయంలో పరీక్షా కేంద్రానికి ఇద్దరు విద్యార్థినులు నిర్ణీత సమయం కన్నా ఆలస్యంగా చేరుకోవడంలో పోలీసులు, అధికారులు అనుమతించలేదు. రాజాం గొల్లవీధికి చెందిన కోడిబోయన సంధ్య అనే విద్యార్థిని మధ్యాహ్నం 1.42 గంటలకు చేరుకుంది. అలాగే పాలకొండకు చెందిన మరో విద్యార్థిని మధ్యాహ్నం 1.48 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోగా.. అధికారులు లోపలకు అనుమతించలేదు. దీంతో ‘కాళ్లు పట్టుకుంటాం సార్‌.. పరీక్ష రాసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి. లోపలకు విడిచిపెట్టండి’ అని ఆ విద్యార్థినులతోపాటు వారి తల్లిదండ్రులు బతిమిలాడారు. కాగా నిర్ణీత సమయం దాటిపోయిందని.. నిబంధనలు అతిక్రమిస్తే తమ ఉద్యోగాలు పోతాయని కేంద్రీయ విద్యాలయం వద్ద అధికారులు, పోలీసులు తెలిపారు. దీంతో ఆ ఇద్దరు విద్యార్థినులు ఏడ్చుకుంటూ.. నిరాశతో వెనుదిరిగారు.

  • కానిస్టేబుల్‌ సేవాగుణం

  • శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రానికి ఓ దివ్యాంగ విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు చేరుకున్నాడు. నిర్ణీత సమయం(1.30 గంటలు) దగ్గర పడుతుండడంతో ఎంతో కంగారుపడ్డాడు. అక్కడే విధుల్లో ఉన్న వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ కానిస్టేబుల్‌ టి.జగదీష్‌కుమార్‌ ఆ దివ్యాంగ విద్యార్థిని భుజంపై మోసుకెళ్లారు. నిర్ణీత సమయంలో స్కానింగ్‌ ప్రాసెస్‌తోపాటు పరీక్షా కేంద్రంలో కూర్చోబెట్టారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ సేవాగుణాన్ని అక్కడ ఉన్నవారంతా అభినందించారు.

Updated Date - May 04 , 2026 | 12:16 AM