Share News

అది పౌరుల ఓటు హక్కును కాలరాయడమే!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:28 AM

‘సర్‌ పేరుతో దేశవ్యాప్తంగా 13కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం అంటే పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, భారత మాజీ అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ రాజు రామచంద్రన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అది పౌరుల ఓటు హక్కును కాలరాయడమే!

సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌

నెల్లూరులో ఐలు 13వ రాష్ట్ర మహాసభలు ప్రారంభం

నెల్లూరు(లీగల్‌),అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): ‘సర్‌ పేరుతో దేశవ్యాప్తంగా 13కోట్ల మంది పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం అంటే పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే’ అని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది, భారత మాజీ అడిషనల్‌ సోలిసిటర్‌ జనరల్‌ రాజు రామచంద్రన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలు) 13వ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ఐలు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీవీ రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా రామచంద్రన్‌ ప్రసంగించారు. ‘కేంద్రం తీసుకువచ్చిన కొత్త నియామక చట్టం(2023 యాక్ట్‌) ద్వారా ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి దెబ్బతిన్నది. ఆర్టికల్‌ 324(2) కింద ఏర్పాటు చేసిక కొత్త సెలక్షన్‌ కమిటీలో ప్రధాని, ఆయన సూచించిన కేంద్ర మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభుత్వానిదే మోజారిటీ. దీనివల్ల ఈసీ నియామకాల్లో పారదర్శకత లోపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఆ భయాలు నిజమవుతున్నాయని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు దొరికాయి. ఉద్యమాలకు పురిటిగడ్డ, పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన నేల మీద నుంచి(నెల్లూరు) ఈ మాటలు చెబుతున్నా. ఆర్టికల్‌ 324 ఆశయాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. ఈసీ ఏకపక్ష నిర్ణయాలకు వేదిక కాకూడదు’ అన్నారు. సుప్రీంకోర్టు మరో న్యాయవాది, పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అంజనా ప్రకాశ్‌ మాట్లాడుతూ... ‘భిన్నాభిప్రాయం వ్యక్తంచేయడం ప్రజాస్వామ్యంలో అంతర్భాగం’ అన్నారు. ఐలు జెండాను బీవీ రమణారెడ్డి ఆవిష్కరించారు. అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులు చిత్రపటాలకు నివాళులర్పించారు. ఐలు జాతీయ నాయకుడు సురేంద్రనాథ్‌, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు సుంకర రాజేంద్ర ప్రసాద్‌, సత్తు అంకయ్య, ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు, న్యాయవాది వంకి పెంచలయ్య, ఐలు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కుమార్‌, మాధవరావు, తమిళనాడు హైకోర్టు న్యాయవాది ఇలోంగో తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 800 మందికిపైగా న్యాయవాద ప్రతినిఽధులు పాల్గొంటున్న ఈ సభలు ఆదివారం ముగియనున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

ట్రేడింగ్‌ చీటింగ్‌

పెట్‌ స్కాన్‌కు ప్రతిపాదన

అసలుకే మోసం!

Updated Date - Oct 04 , 2026 | 05:28 AM