Share News

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. నారా లోకేశ్ సహా ప్రముఖుల సంతాపం

ABN , Publish Date - Nov 29 , 2026 | 05:10 PM

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేశ్ సహా తదితరుల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. నారా లోకేశ్ సహా ప్రముఖుల సంతాపం
rayapati sambasiva rao passes away

అమరావతి, నవంబరు 29: సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతిపై నారా లోకేశ్‌తో పాటు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆరుసార్లు ఎంపీగా పనిచేసి.. ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితమిచ్చిన ధన్యజీవి సాంబశివరావు అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

ఆయన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నాను: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్

‘మిత్రులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఐదు పర్యాయాలు లోక్ సభ, ఒక పర్యాయం రాజ్యసభ సభ్యులుగా సేవలందించిన సీనియర్ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు మరణించారన్న వార్త కలచివేసింది. వారి ఆత్మశాంతికై ఆయన ఇష్ట దైవమైన వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.


గుంటూరు జిల్లా.. గొప్ప నాయకుడిని కోల్పోయింది: బీజేపీ ఏపీ చీఫ్

‘గుంటూరు జిల్లా సీనియర్ నాయకులు రాయపాటి సాంబశివరావు మరణించడం విచారకరం. 1982 లో రాజ్యసభకు ఎన్నికయిన రాయపాటి సాంబశివరావు గారు తదుపరి ఐదు పర్యాయాలు లోకసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే సీనియర్ రాజకీయ నాయకులు సాంబశివరావు గారిని గుంటూరు జిల్లా కోల్పోయింది.. వారికి నా నివాళులు. సుదీర్ఘ కాలం గుంటూరు జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన ఆయన ఈరోజు వయోభారంతో కన్నుమూశారు’ అని పివీఎన్ మాధవ్ పేర్కొన్నారు.


ఆయన సేవలు చిరస్మరణీయం: రాష్ట్ర భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖామంత్రి

‘తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు మృతిపై విచారకరం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. సుదీర్ఘమైన ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. రాయపాటి సాంబశివరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని కొల్లు రవి పేర్కొ్న్నారు.


ఆయన మరణం పార్టీకి తీరని లోటు: టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు

‘మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆరుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు సేవలందించిన రాయపాటి, ప్రజా జీవితంలోనూ, పార్టీ అభ్యున్నతిలోనూ అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రాయపాటి మృతి పట్ల గుంటూరు మేయర్ దంపతులు కోవెలమూడి లక్ష్మీఅపర్ణ- రవీంద్ర సంతాపం తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలుసా?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఆరుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు..!

Updated Date - Nov 29 , 2026 | 05:14 PM