ప్రకాశం జిల్లాలో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - May 20 , 2026 | 02:34 PM
ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు.
ప్రకాశం జిల్లా, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని యర్రగొండపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంజనేయులు అనే యువకుడిని అత్యంత కిరాతకంగా ఓ వ్యక్తి హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి బోరుబావిలో పడేసిన ఘటన వెలుగులోకి రావడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆంజనేయులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కూతురితో సన్నిహితంగా ఉన్నాడనే కారణంతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యర్రగొండపాలెం గ్రామానికి చెందిన వెంకటనారాయణ.. ఆంజనేయులు అనే యువకుడిని ముక్కలుగా చేసి బోరు బావిలో పడేశాడు. తన కూతురితో ఆంజనేయులు సన్నిహితంగా ఉంటున్నాడనే అనుమానంతో వెంకటనారాయణ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే వివాదం చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వెంకటనారాయణపై అనుమానం వ్యక్తమైంది.
ముక్కలుగా చేసి.. బోరుబావిలో పడేసి..
ఆంజనేయులును హత్య చేసిన నారాయణ.. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు ముక్కలుగా చేసి సమీపంలోని బోరుబావిలో పడేశాడు.ఈ ఘటనతో యర్రగొండపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి.. ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దింపినట్లు సమాచారం. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు..?, ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు వెంకటనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.