మార్కాపురం ప్రజలకు కృష్ణా జలాలతో స్వాగతం చెబుతున్నాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 31 , 2026 | 02:03 PM
రాష్ట్రానికి పట్టిన గ్రహణం.. గొడ్డలి పార్టీ అని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 2024 తర్వాత రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని ఆయన పేర్కొన్నారు.
ఒంగోలు, ఆగస్టు 31: కరవు, ఫ్లోరైడ్‌తో అలసిన మార్కాపురం ప్రజలకు.. కృష్ణా జలాలతో స్వాగతం చెబుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణమ్మను తీసుకొచ్చాం.. కరవును తరిమికొట్టామని అన్నారు. వెలిగొండకు జలసిరులు.. అభివృద్ధికి రెక్కలు అని పేర్కొన్నారు. వెలిగొండ నిజంగానే బంగారు కొండ అని ఆయన అభివర్ణించారు.
వెలిగొండలో 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని వివరించారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2024లో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిందని.. నాటి నుంచి వెనుదిరిగి చూడలేదని తెలిపారు.
ప్రధాని మోదీ సహాయం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో ఈ వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించుకున్నామని చెప్పారు.1996లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేశానని వివరించారు.
రైతుల త్యాగం వల్ల లక్షల మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన అందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇది భగీరథ ప్రయత్నమని తెలిపారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఎన్నో సవాళ్లను అధిగమించానని చెప్పారు. రూ.7,983 కోట్లతో తొలిదశ పూర్తి చేశామన్నారు. నిర్వాసితులకు రూ.1,071 కోట్లు ఇచ్చామని వివరించారు. లబ్ధిదారులతోపాటు నిర్వాసితులూ సంతోషంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
నిర్వాసితులకు రూ.165 కోట్లు చెల్లించామని చెప్పారు. అలాగే రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన గ్రహణం.. గొడ్డలి పార్టీ అని మండిపడ్డారు. 2024 తర్వాత రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
సిగ్గులేని గొడ్డలి పార్టీకి మానవత్వం లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండానే.. సినిమా సెట్టింగులు, ఫేక్ ప్రచారాలతో ఆటలాడారని మండిపడ్డారు. విలువైన కాలాన్ని గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఫేక్ ప్రచారాలు చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు. 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2 పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు.
పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. ఆ తర్వాత మార్కాపురంలో కృష్ణా పుష్కరాలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నదుల అనుసంధానం జరగాలని తెలిపారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే 4 రాష్ట్రాల్లో పంటలు సుసంపన్నం అవుతాయని చంద్రబాబు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏ ప్రభుత్వమైనా టైటిల్ మారింది తప్ప.. దోపిడీ విధానాలు మారలేదు: టీబీజేపీ చీఫ్
నీట్ పేపర్ లీక్ కేసు.. రంగంలోకి ఈడీ
For More AP News And Telugu News