ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి నోబెల్ గ్రహీతలు రావాలి.. ఉపరాష్ట్రపతి ఆకాంక్ష
ABN , Publish Date - Oct 26 , 2026 | 01:28 PM
విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. వైద్య విద్యారంగానికి ఎన్టీఆర్ అందించిన సేవలను కొనియాడారు. ఈ విశ్వవిద్యాలయం నుంచి భవిష్యత్తులో నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని ఆకాంక్షించారు.
విజయవాడ, అక్టోబర్ 26: విజయవాడలో ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 40వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య విద్యారంగం, ఎన్టీఆర్ సేవలు, దేశ ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్య, ఆరోగ్య, సంక్షేమ, సాంస్కృతిక రంగాలు, తెలుగు భాషాభివృద్ధికి స్వర్గీయ ఎన్టీ రామారావు చేసిన సేవల్ని కొనియాడారు.
దేశంలోనే తొలి వైద్య విశ్వవిద్యాలయాన్ని (NTR Health University) స్థాపించడంలో ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి ఎంతో కీలకమైనదని ఉపరాష్ట్రపతి పేరొన్నారు. 'తెలుగు గంగ' ప్రాజెక్టు ద్వారా చెన్నై నగరానికి తాగునీరు అందించిన ఎన్టీఆర్ దాతృత్వం, మానవతా దృక్పథం ఎంతో ప్రశంసనీయమని గుర్తుచేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 'వికసిత్ భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఉపరాష్ట్రపతి గణాంకాలతో సహా వివరించారు.
నోబెల్ బహుమతి ఆకాంక్ష
ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి భవిష్యత్తులో నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని, ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనల్లో గుర్తింపు సాధించాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు సరికొత్త పరిష్కారాలు కనుగొనేలా అధునాతన పరిశోధనలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిజిటల్ హెల్త్ సాంకేతికతలకు ప్రాధాన్యం పెరుగుతోందని చెప్తూనే.. సాంకేతికత ఎంత పెరిగినా వైద్యులు 'మానవీయ స్పర్శ'ను మరవకూడదని హితవు పలికారు. వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం, రోగుల పట్ల ఆప్యాయత చూపడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల (Drugs) వినియోగాన్ని అరికట్టేందుకు వైద్యులు, యువత ముందడుగు వేయాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. (NTR Health University 40th Anniversary)
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదేళ్ల గరిష్ఠ స్థాయిలో నోట్ల చలామణి