Share News

చెప్పాం.. చేసి చూపించాం: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:09 AM

పోలవరం ప్రాజెక్టు పూర్తికాక ముందే గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు జల కళ వచ్చిందని జల వనరులశాఖా మంత్రి నిమ్మల రామానాయడు అన్నారు.

చెప్పాం.. చేసి చూపించాం: మంత్రి నిమ్మల

పాయకరావుపేట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పూర్తికాక ముందే గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు జల కళ వచ్చిందని జల వనరులశాఖా మంత్రి నిమ్మల రామానాయడు అన్నారు. ఎడమ కాలువ ప్రారంభం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయమని, 2026లో ఉత్తరాంధ్రకు గోదావరి తీసుకువస్తామని ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు ఉన్నప్పటికీ పోలవరం ఎడమ కాలువలో తట్టమట్టి కూడా తీయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులను వేగవంతం చేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చిందన్నారు.

పురుషోత్తపట్నం పంప్‌హౌస్‌ నుంచి గోదావరి నీటిని పోలవరం ఎడమ కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. 10 భారీ మోటార్ల ద్వారా 24 గంటలకు 0.32 టీఎంసీ చొప్పున విడుదల చేస్తున్నారు. ఆ నీరు ఏలేరు, అనకాపల్లి దిశగా ఉరకలు వేస్తోంది. జూలై 9 నుంచి పంపింగ్‌ ప్రారంభించగా.. ఇప్పటి వరకూ సుమారు 12 టీఎంసీల గోదావరి జలాలను ఎడమ కాలువ గుండా పంపించారు. ఇందులో ఏలేరు రిజర్వాయర్‌కు 4 టీఎంసీలను మళ్లించారు. మరోవైపు గోదావరి నీటి మట్టం తగ్గుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఎల్‌నినో ప్రభావం ఎత్తిపోతలపై కూడా పడే అవకాశముంది. ఎప్పటి మాదిరిగానే వర్షాలు కురిస్తే సమస్య ఉండేది కాదు. గోదావరిలో పంపులు ఉన్న చోట కనీసం 14 అడుగుల నీటి మట్టం ఉండాలి. అంతకంటే తగ్గితే పంపింగ్‌ ఆపాల్సి ఉంటుంది. వారం క్రితం నీటిమట్టం 19 అడుగులుండగా.. మూడ్రోజుల కిందట 18 తగ్గి.. 17 అడుగుల మట్టం ఉంది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:20 AM