Tirumala laddu Ghee Scam: తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Jan 09 , 2026 | 08:16 PM
తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కల్తీ నెయ్యి తయారీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఈ కేసులో ఏ 34 విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు.
నెల్లూరు, జనవరి 09: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏ34 విజయభాస్కర్ రెడ్డి బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను నెల్లూరులోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. శుక్రవారం ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదిస్తూ.. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో విజయభాస్కర్ అనుసరించిన తీరును కోర్టు దృష్టికి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన విషయాలు కోర్టుకు వెల్లడించారు.
టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల పనితీరు బాగా లేకపోయినా వారికి అనుకూలంగా ఆయన నివేదిక ఇచ్చారని తెలిపారు. కంపెనీల పని తీరు బాగుందని.. నెయ్యి నాణ్యంగా ఉందంటూ సర్టిఫికెట్ జారీ చేశారని చెప్పారు. ఆ క్రమంలో 2023లో భోలే బాబా కంపెనీ నుండి రూ.75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి రూ.8 లక్షలు లంచంగా విజయభాస్కర్ రెడ్డి పొందారని కోర్టుకు ఏపీపీ సోదాహరణగా వివరించారు.
ఇక అల్ఫా డైరీ కంపెనీ నుంచి ఎనిమిది గ్రాముల బంగారాన్ని లంచంగా తీసుకున్నారని చెప్పారు. ఆ యా కంపెనీలకు అనుకూలంగా నివేదిక ఇవ్వడం వల్ల గత ప్రభుత్వ హయాంలో అంటే.. 2019 - 2024 మధ్య టీటీడీకి రూ.118 కోట్ల నష్టం వాటిల్లిందని కోర్టుకు విన్నవించారు. ఇక సిట్ విచారణలో తాను లంచం తీసుకున్నట్లు ఆయన ఆంగీకరించారన్నారు.
ఈ నగదు మొత్తాన్ని హవాలా రూపంలో విజయభాస్కర్ రెడ్డి తీసుకున్నట్లు తన విచారణలో సిట్ గుర్తించింది. అయితే విజయ భాస్కర్ రెడ్డి నుంచి రూ.34 లక్షలు నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. ఈ వివరాలన్నీ ఏసీబీ కోర్టు దృష్టికి ఏపీపీ తీసుకు వెళ్లడంలో.. విజయభాస్కర్ రెడ్డి బెయిల్‌ను న్యాయమూర్తి నిరాకరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు
సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదనే రాజీనామా: జంగా
For More AP News And Telugu News