Share News

Venkayya Naidu: ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు

ABN , Publish Date - Jan 09 , 2026 | 06:09 PM

స్వతంత్ర భారతదేశంలో ఆత్మ నిర్భర భారత్ కోసం అందరూ కృషి చేయాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచంలో నాలుగో వంతు జీడీపీ భారతదేశానిదేనని పేర్కొన్నారు.

Venkayya Naidu: ఆమె కారణంగానే రాజకీయాల్లోకి వచ్చా: వెంకయ్యనాయుడు
Former Vice President Venkaiah Naidu

విశాఖపట్నం, జనవరి 09: భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని.. భారతీయ వంటలు అందరూ తినాలని దేశ ప్రజలకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సంక్రాంతి పండగ అంటే తనకు చాలా ఇష్టమన్నారు. విశాఖపట్నంపై తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సంక్రాంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. తాను ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. విద్యార్థి దశలో ఎన్నో పోరాటాలు చేశానని.. జైలుకు సైతం వెళ్లానని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఆమె కారణంగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు.


స్వతంత్ర భారతదేశంలో ఆత్మ నిర్భర భారత్ కోసం అందరూ కృషి చేయాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ప్రపంచంలో నాలుగో వంతు జీడీపీ భారతదేశానిదేనని పేర్కొన్నారు. పశు సంపద ఎంత బాగుంటే జాతీయ సంపద కూడా అంత బాగుంటుందన్నారు. ఆత్మ నిర్భర భారత్ ముందు.. ఎవరు ఎన్ని సుంకాలు వేసినా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. అందుకే ఆత్మ నిర్భర భారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారని వివరించారు. తాను రైతు బిడ్డగా పుట్టానని.. అందుకే రైతులు అంటే తనకు చాలా అభిమానమన్నారు.


తెలుగు రైతుల పండగ సంక్రాంతి.. తెలుగు వారి లోగిళ్లలో ఇది పెద్ద పండగని వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఫల సాయాన్ని అందించే వ్యవసాయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడని ప్రజలకు ఆయన హితవు పలికారు. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులను, విద్య నేర్పిన గురువులను, మాతృభాషను మర్చిపోకూడదని చెప్పారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో పరిపాలన చేయాలంటూ ప్రభుత్వాలకు ఆయన సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలంటూ ఈ సందర్భంగా తల్లిదండ్రులకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కీలక సూచన చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదనే రాజీనామా: జంగా

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..

For More AP News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 09:43 PM