Janga Krishnamurthy: సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకూడదనే రాజీనామా: జంగా
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:03 PM
టీటీడీ బోర్డు సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు. ఈ రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వివరించారు.
అమరావతి, జనవరి 09: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యత్వానికి తాను రాజీనామా చేశానని జంగా కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఇవాళ (శుక్రవారం) విజయవాడలో జంగా కృష్ణమూర్తి విలేకర్లతో మాట్లాడుతూ.. తన రాజీనామాపై వివరణ ఇచ్చారు. 2005లో తాను టీటీడీ సభ్యుడిగా ఉన్న సమయంలో తిరుమలలో గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని కోరినట్లు జంగా తెలిపారు.
తన విజ్ఞప్తి మేరకు భూమిని ఇచ్చారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. కానీ ఆ సమయంలో ఆర్థిక వెసులుబాటు లేక గెస్ట్ హౌస్ నిర్మించ లేకపోయానని తెలిపారు. మళ్లీ తనకు స్థలం కేటాయించాలని తాజాగా టీటీడీని కోరారని పేర్కొన్నారు. అందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసి ముఖ్యమంత్రికి పంపిందని చెప్పుకొచ్చారు. ఈ భూమిని తనకు కేటాయించాలా, వద్దా? అనేది ప్రభుత్వం నిర్ణయమన్నారు. దీనిపై పరిపాలన పరంగా నిర్ణయం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే ఈ తీర్మానంపై టీటీడీ బోర్డులో సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ ఒక్కరే వ్యతిరేకించారని పేర్కొన్నారు. తనకు స్థలం కేటాయించడం ద్వారా బోర్డు తప్పు చేసిందనే ఆలోచన రాకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి ప్రకటించారు. టీటీడీ బోర్డుకు స్థలం కేటాయించడానికి హక్కు లేదా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తనకు కేటాయించి.. రద్దు చేసిన భూమిని తాను చైర్మన్‌గా ఉన్న ఓం శ్రీ నమో వెంకటేశ్వర గ్లోబల్ ట్రస్ట్‌కు మళ్లీ కేటాయించాలని టీటీడీని కోరానంటూ జంగా కృష్ణమూర్తి ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. ఇది ఎలా తప్పు అవుతుందంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. తాను ఈ నిర్ణయం తీసుకోకుంటే ప్రభుత్వానికి, టీటీడీ బోర్డుకు ఇబ్బంది వస్తుందనే ఈ పదవికి రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. ముచ్చటగా మూడోసారి శ్రీవారి సేవ చేసుకోవడానికి సీఎం చంద్రబాబు తనకు అవకాశం కల్పించారని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీ సభ్యత్వానికి జంగా రాజీనామా.. ఆమోదించాలంటూ సీఎంకు లేఖ
మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ..
For More AP News And Telugu News