2,50,893 ఇళ్లను పేదలకు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:44 PM
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు.
తిరుపతి: సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట వేదికగా 2.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పంపిణీ చేశారు. 2,50,893 పేద కుటుంబాలకు ఇళ్లను పంపిణీ చేసి వారితో గృహ ప్రవేశం చేయించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ మెుత్తంలో గృహ ప్రవేశాలు చేయించడం ఇది రెండోసారి. మెుదటి విడత కింద 12 నవంబర్ 2025న 3,00,192 ఇళ్లను పంపిణీ చేసింది. తాజాగా నేడు 1,00,875 టిడ్కో ఇళ్లతోపాటు మరో 1,50,018 ఇళ్లను మెుత్తం 2,50,893 గృహాలను పేదలకు సీఎం చంద్రబాబు సర్కార్ అందించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..'మార్చి నెలలో మొన్ననే ఉగాది, నిన్న రంజాన్ జరుపుకున్నాం. ఇవాళ 2,50,893 మందికి ఇళ్ల పండుగ జరుపుకుంటున్నాం. ఇది ఒక చరిత్ర. మీ అందరిలో ఆనందం చూస్తుంటే, నా జన్మ ధన్యమైందని అనిపిస్తోంది. భవిష్యత్తులో మీకన్నీ శుభాలే జరగాలని, అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు గుడిసెల్లో ఉండేవారం. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఇవ్వాలని, పక్కా ఇళ్ల నిర్మాణాలకి యుగపురుషుడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలనేది టీడీపీ సిద్ధాంతం. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. వ్యవస్థలని అస్తవ్యస్తం చేశారు. అన్నింటినీ సరిచేస్తున్నాం.
ధనికవర్గాలు ఉండే మాదిరిగా టిడ్కో ఇళ్లని నిర్మించిన ఘనత టీడీపీదే. మంచి ఇళ్లు కడితే పాడు చేశారు. పేదల పొట్ట కొట్టారు. ఈ ఏడాది చివరికి పది లక్షల ఇళ్లు ప్రజలకి అందివ్వడమే లక్ష్యం. గత ప్రభుత్వం ప్రజావేదిక విధ్వంసంతో మొదలెట్టి రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేసింది. ఎక్కడ చూసినా అవినీతి, అధికార దుర్వినియోగం. రూ.174కోట్లు లబ్ధిదారులు కడితే వాటినీ మాయం చేశారు. 82 వేల కుటుంబాలకి ఆ డబ్బును అకౌంట్లలో వేస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని దారి మళ్లించారు. నివాస యోగ్యంకాని స్థలాల్లో ఇళ్లు కట్టించారు. వైజాగ్‌లో ప్యాలెస్ నిర్మించుకున్నారు కానీ పేదలకి ఇళ్లు ఇవ్వడానికి మనసు రాలేదు. అంత పనికిమాలిన ప్రభుత్వాన్ని నేను నా జీవితంలో చూడలేదు.
పేదలు ఉండాల్సింది మురికివాడల్లో కాదు. ఇలాంటి టిడ్కో ఇళ్లలో ఉండాలి. మీలో ఆశలు చిగురించాలి. ఇంటి జాగాలేని వారికి జాగా ఇస్తాం. బ్రహ్మాండంగా ఇళ్లు కట్టించి, పేదలకి ఒక ఆస్తి కల్పిస్తాం. ప్రతి ఇంటికీ CNG కనెక్షన్ ఉండాలి. దానికి కూడా రాయితీ ఇస్తాం. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండాలి. ప్రతి ఇంటికీ తాగునీరు ఇవ్వాలని పథకం మొదలెడితే దాన్నీ పాడు చేశారు. ప్రతి ఒక్క కుటుంబానికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. ప్రతి ఇంట్లో ఎక్కడికక్కడ విద్యుత్ తయారు చేసుకునే అవకాశం కల్పించాం. ఎస్సీలు, ఎస్టీలకి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం. బీసీలకి రూ.20 వేలు రాయితీ ఇస్తున్నాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేశాం. ఈ ఏడాది 5 లక్షల మంది మహిళలని పారిశ్రామికవేత్తలని చేస్తాం. రాబోయే ఎన్నికల్లో మహిళలకి సీట్లు పెరగబోతున్నాయి. వైసీపీ పాలనలో పోలవరాన్ని నాశనం చేశారు. గోదావరి పుష్కరాలకంటే ముందుగానే పోలవరాన్ని పూర్తి చేస్తాం.
అమరావతిని హైదరాబాద్, చెన్నై కంటే గొప్పగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువతకు ఇదే ఆహ్వానం. టీడీపీలోకి వస్తే అవకాశాలు కల్పిస్తాం. వైసీపీలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజలకు కోపం రావడం వల్లే వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. ఏప్రిల్ నుంచి ఆకస్మిక తనిఖీలు చేస్తాం. బాగా పనిచేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తాం. ప్రజలు మెచ్చేలా నాయకులు, అధికారులు పనిచేయాలి. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోతే ఊరుకునేది లేదు. టెక్నాలజీ ఉపయోగించి సంక్షేమ పథకాల అమలు చేస్తున్నాం. పెన్షన్ల పంపిణీని రియల్‌టైమ్ మానిటర్ చేస్తున్నాం. బాగా పనిచేస్తున్న అధికారులను అభినందిస్తాం. పనిచేయని అధికారులతో పని చేయించడం మా బాధ్యత' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
అప్‌డేట్ కావడంలో పార్టీ విఫలమైంది: ఏవోబీ కమిటీ సభ్యుడు నారాయణరావు