ప్రతి ధాన్యం గింజనూ కొంటాం: మంత్రి నాదెండ్ల మనోహర్
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:10 PM
రైతుల నుంచి మొత్తం ధాన్యాన్నీ కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదని మంత్రి ఆరోపించారు.
నెల్లూరు, మార్చి 30: నెల్లూరు జిల్లా సాగు చాలా ప్రత్యేకమైనదని మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) అన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా దిగుబడి వచ్చే ప్రాంతమిది అని చెప్పుకొచ్చారు. ఈ రోజు (సోమవారం) ఉదయం కోవూరు మండలం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాల్లో రైతులతో మాట్లాడి వారి సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రైతుల నుంచి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కూడా కొనుగోలు చేయలేదని, రైతులను నిలువునా ముంచేశారని ఆయన ఆరోపించారు.
ధాన్యం కొనుగోలు విషయంలో అప్పటి నేతలు గోల్‌మాల్ చేసి రూ.82 కోట్ల మేర అవినీతి చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు వ్యవస్థలను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పారు. గత ఏడాది 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఈ ఏడాది 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. రైతులందరూ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు. చివరి వరకు ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు.
ధాన్యం అమ్మిన ఎనిమిది గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూస్తున్నామని మంత్రి అన్నారు. క్షేత్రస్థాయిలోనూ రైతులు.. డబ్బులు వేగంగా పడుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కల్లాలు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. రైతులకు తేమ సమస్య ఉందని, 22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకునేలా ఆదేశాలు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆధునిక డ్రోన్లు ఇచ్చిన తరహాలో డ్రయర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లులన్నీ వెంటనే బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని, అలా చేయని పక్షంలో వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి హెచ్చరించారు. మిల్లర్ల అవకతవకలు, నిర్లక్ష్యం సహించేది లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
నరసరావుపేట ఆత్మహత్యాయత్నం ఘటనలో మరొకరి మృతి
ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు... ఆ మూడు పిటిషన్లు డిస్మిస్
Read Latest AP News And Telugu News