పంటల కొనుగోళ్లపై అసత్యప్రచారాలు చేస్తోందంటూ ‘సాక్షి’ పై మండిపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:46 PM
పంటల కొనుగోళ్ల గణాంకాలను దాచిపెడుతూ.. రైతులను రాజకీయాలకు పావులుగా వాడుకుంటున్నారని జగన్, సాక్షి పత్రికలపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అమరావతి, అక్టోబర్ 11: పంటల కొనుగోళ్లపై సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్తా కథనాలను వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే గణాంకాలను దాచిపెడుతూ.. ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైసీపీ అసత్యప్రచారాలకు గణాంకాలతోనే సమాధానం చెబుతామన్నారు.
‘పంటల కొనుగోళ్లపై రైతులకు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024–25లో మార్క్‌ఫెడ్‌కు రూ.821.37 కోట్లు చెల్లించింది. 2025–26లో రూ.1,123.06 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రూ.1,944.43 కోట్లను విడుదల చేసింది. వీటితో 1,50,747 మంది రైతుల నుంచి 2.84 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోళు చేసింది. ఖరీఫ్–2026కు సంబంధించిన ప్రతిపాదనను ఆగస్టు 17నే ఖరారు చేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సెప్టెంబర్ 23నే కేంద్రానికి లేఖ రాసింది. ఖరీఫ్–2026 పంట కొనుగోళ్లకు కేంద్రం ఆమోద ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఈ గణాంకాలను పరిశీలించిన తర్వాతనైనా జగన్ ఆయన సాక్షి పత్రికలో వచ్చిన కథనాలపై సమాధానం చెప్పాలి’ అని మంత్రి డిమాండ్ చేశారు.
రైతులకు సకాలంలో చెల్లింపులు చేసేందుకు రూ.300 కోట్ల ఆర్థిక సహాయం మార్క్‌ఫెడ్ కోరినట్లు మంత్రి తెలిపారు. మద్దతు ధర విలువలో కనీసం 15 శాతం రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు.. రైతులు తక్కువ ధరలకు పంటలు అమ్ముకోకుండా మద్దతు ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...
అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...
Read Latest AP News And Telangana News