Share News

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:38 PM

నంద్యాల జిల్లా బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ముస్లింల కోసం ప్రత్యేక షాదిఖానాను నిర్మిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ నేతలు కావాలనే బురదజల్లేందుకు యత్నిస్తున్నారని.. వారి మాటలు నమ్మవద్దన్నారు.

పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు: జనార్ధన్ రెడ్డి
Minister BC Janardhan Reddy

నంద్యాల జిల్లా, ఏప్రిల్ 18: బనగానపల్లెలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని వైఎస్సార్ బీసీ కాలనీలో ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీకి అనువుగా చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనుల్లో భాగంగా స్థానిక అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న ఈద్గాను అధికారులు తొలగించిన విషయంపై ఆయన వివరణ ఇచ్చారు. అధికారికంగా ఆ నిర్మాణానికి ఎలాంటి అనుమతులూ లేకపోవడంతోనే తొలగించాల్సి వచ్చిందన్నారు. మరో అనువైన స్థలాన్ని ఎంపిక చేసి, సకల సౌకర్యాలతో ఈద్గాను నిర్మిస్తామని ముస్లిం మత పెద్దలకు మంత్రి హామీ ఇచ్చారు. మరో 15 రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.


'ఈద్గా తొలగింపు అంశాన్ని స్థానిక వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను విమర్శించే స్థాయి, నా గురించి నైతికంగా మాట్లాడే హక్కు వారికి లేదు. పబ్లిసిటీ కోసం వైసీపీ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. బనగానపల్లె సెంటర్లో 2018లో మైనార్టీల కోసం షాదిఖానా నిర్మాణం చేపడితే అధికారంలోకి వచ్చాక నాటి వైసీపీ ఎమ్మెల్యే గాలికొదిలేశారు. ఊరిబయట కమ్యూనిటీ హాల్ నిర్మించి, అదే షాదీఖానా అని ముస్లిం సోదరులను మాజీ ఎమ్మెల్యే మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడాలేని విధంగా నేడు బనగానపల్లెలో ముస్లిం మైనార్టీ సోదరుల కోసం భారీ స్థాయిలో షాదిఖానా నిర్మిస్తున్నాం. గతంలో ఇక్కడ ముస్లింల కోసం.. అన్ని వసతులతో ఒక మదర్సా, కాంపౌండ్ వాల్ కూడా నిర్మించాం' అని జనార్ధన్ రెడ్డి వివరించారు.


తాను రాజకీయాల్లోకి రాకముందు బనగానపల్లె బస్టాండ్ సమీపంలో ముస్లిం సోదరుల కోసం ఒక దర్గాను కూడా నిర్మించినట్టు మంత్రి తెలిపారు. వైసీపీ నేతల మాటలను ముస్లిం సోదరులు నమ్మవద్దని ఆయన కోరారు. నేడు రాజకీయ ఉనికి కోసం మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముస్లిం మైనార్టీల పక్షపాతి అని జనార్ధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.


ఇవీ చదవండి:

నిడదవోలు – దువ్వాడ రైల్వే క్వాడ్రూప్లింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పేదలకు నాణ్యమైన భోజనమే అన్న క్యాంటీన్ల లక్ష్యం: హోంమంత్రి అనిత

Updated Date - Apr 18 , 2026 | 06:05 PM