Share News

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:28 PM

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతరేకించిన తీరును ఆయన తప్పుపట్టారు.

మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం అవసరం: స్పీకర్‌ అయ్యన్న
AP Assembly Speaker Ayyanna Patrudu

ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విచారం వ్యక్తం చేశారు. ఈ పరిణామం దురదృష్టకరమని, మహిళలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించే ప్రయత్నానికి ఇదో ఎదురుదెబ్బ అని ఆయన అభిప్రాయపడ్డారు. 'లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం దురదృష్టకరం. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించడం దారుణం. రాజకీయాల్లో మహిళలను ప్రోత్సహించాలని ఎన్టీఆర్ నాంది పలికారు. పురుషుల కంటే మహిళలే రాజకీయాల్లో గొప్పగా రాణిస్తారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎంతో అవసరం. రాబోయే రోజుల్లోనైనా మహిళా బిల్లు గెలుస్తుందని ఆశిస్తున్నాను' అని సభాపతి అన్నారు.


రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా మరోసారి ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్ సింగ్‌కు స్పీకర్ అయ్యన్న అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలుపుతూ స్పీకర్ ఓ అధికారిక లేఖ రాశారు. హరివంశ్‌ నియామకం పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమని కొనియాడారు. ఆయన తన అనుభవంతో రాజ్యసభ హుందాతనాన్ని మరింత పెంచుతారని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఆయన తన బాధ్యతలను అత్యంత విజయవంతంగా నిర్వహించాలని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని ఆకాంక్షించారు.


విపక్షాలు మోకాలడ్డటం బాధాకరం: మంత్రి గుమ్మడి

మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోవడంపై రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ఈ బిల్లుకు విపక్షాలు మోకాలడ్డటం బాధాకరమని ఆమె అన్నారు. 'ఇండియా కూటమి.. దేశ మహిళలకు ద్రోహం చేసింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందకూడదని బిల్లు వీగిపోయేలా చేసి, సంబరాలు జరుపుకోవటం సిగ్గు చేటు. ఓ మహిళా నేతగా దాదాపు రూ.400 కోట్ల ప్రభుత్వ నిధులు తెప్పించుకుని అభివృద్ధి చేస్తున్నా. మా సంఖ్య మరింత పెరిగితే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఊహించుకోవచ్చు. మహిళలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలని ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన, చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకం' అని సంధ్యారాణి కొనియాడారు.


ఇవీ చదవండి:

నిడదవోలు – దువ్వాడ రైల్వే క్వాడ్రూప్లింగ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పేదలకు నాణ్యమైన భోజనమే అన్న క్యాంటీన్ల లక్ష్యం: హోంమంత్రి అనిత

Updated Date - Apr 18 , 2026 | 04:40 PM