Share News

జగన్‌కు పోలీసులు నోటీసులు

ABN , Publish Date - Feb 05 , 2026 | 09:23 PM

ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ఆయన నివాసంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

జగన్‌కు పోలీసులు నోటీసులు

విజయవాడ, ఫిబ్రవరి 05: మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటికి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీసులు జగన్ కు షాక్ ఇచ్చారు. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి వెళ్లడంపై ఆంక్షలు విధించారు విజయవాడ పోలీస్ కమిషనర్. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఉదయం వేళలో.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఉంటుంది.

ఈ నేపథ్యంలో దుర్గమ్మ వారిధి మీదుగా కాకుండా.. వెస్ట్ బైపాస్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లాలని వైఎస్ జగన్‌కు కమిషనర్ కార్యాలయం నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై జోగి రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు కొందరు జోగి ఇంటిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పరామర్శించేందుకు జోగి ఇంటికి జగన్ వెళ్తున్నారు.


మరోవైపు బుధవారం నాడు గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా భారీ కాన్వాయ్‌తో వైఎస్ జగన్.. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నారు. దాంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


అలాగే ఇబ్రహీంపట్నం వెళ్లే క్రమంలోనూ వైఎస్ జగన్ భారీ కాన్వాయ్‌తో వెళ్లితే.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని నగర పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా వైఎస్ జగన్‌కు కమిషనర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.


జగన్ రూట్ మ్యాప్..

శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నం బయలుదేరతారు. కనకదుర్గమ్మ వారధి, ఆర్టీసీ బస్టాండ్, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మీదుగా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి చేరుకుని పరామర్శిస్తారు. అనంతరం వైఎస్ జగన్ మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సాగునీటి సంఘాలకే కాల్వల మరమ్మతు పనులు: సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

For More AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 10:17 PM