Share News

సాగునీటి సంఘాలకే కాల్వల మరమ్మతు పనులు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 05 , 2026 | 08:27 PM

గతంలో రాయలసీమలోని ఊట కాలువల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమను రాళ్ల సీమగా మారకుండా రతనాల సీమగా మార్చాలని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ ప్రాజెక్టులు చేపట్టారని చంద్రబాబు వివరించారు.

సాగునీటి సంఘాలకే కాల్వల మరమ్మతు పనులు: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 05: తెలుగుదేశం పార్టీ వల్లే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గురువారం నాడు రాజధాని అమరావతిలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను నేడు రైతు సానుకూలప్రదేశ్‌గా మారుస్తున్నామని చెప్పారు. నీటి సంరక్షణ చేయాలని, అయితే చాలా మంది దీన్ని పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


గతంలో రాయలసీమలోని ఊట కాలువల్లోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. రాయలసీమ రాళ్ల సీమగా మారకుండా రతనాల సీమగా మార్చాలని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్.. ప్రాజెక్టులు చేపట్టారని ఈ సందర్భంగా వివరించారు. టీడీపీ చూపిన చొరవ కారణంగానే హంద్రీనీవా, గాలేరు- నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు వచ్చాయన్నారు. తెలుగు గంగ ప్రాజెక్ట్.. రాయలసీమను సస్యశ్యామలం చేస్తూ చెన్నై దాహార్తిని తీరుస్తోందని తెలిపారు.


నీటి కోసం ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చిన పరిస్థితి నెలకొందన్నారు. కావేరీ జల వివాదం అలాంటిదేనని చెప్పారు ముఖ్యమంత్రి. నీటి విలువ తెలిసిన వ్యక్తిగా 'నీరు- మీరు, నీరు- చెట్టు' వంటి కార్యక్రమాల ద్వారా ఇంకుడు గుంతల కార్యక్రమాలు గతంలో చేపట్టామని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. దీని ద్వారా భూగర్భ జలాలు పెంచేలా భూమినే జలాశయంగా మార్చే ప్రక్రియ చేపట్టినట్లు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అనంతపురంలో చేపడుతున్న జల సంరక్షణ కార్యక్రమాన్ని మన్ కీ బాత్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించారని చెప్పుకొచ్చారు.


పది లక్షల ఇంకుడు గుంతలు, మైక్రో ఇరిగేషన్ ద్వారా నీటిని సద్వినియోగం చేస్తున్నామని వివరించారు. అనంతపురం జిల్లాను ఎడారి కాకుండా పండ్ల తోటల వనంగా మార్చామన్నారు. హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 40 జీవనదుల నీటిని సమర్ధంగా వినియోగించుకుంటే కరువనేదే ఉండదన్నారు. ప్రతీ ఎకరాకూ నీటిని ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలంటూ నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


పరుగెత్తే నీటిని నిలపండి, నడిచే నీటిని జలాశయంగా మార్చండి, భూగర్భ జలాశయంలో నీటి నిల్వ పెరిగేలా చూడండంటూ వారికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నీటిని సమర్థవంతంగా వినియోగిస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు. నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలిస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత మీదేనంటూ సాగునీటి సంఘాలకు సూచించారు. ఇక కాల్వల మరమ్మతు పనులు ఇకపై సాగునీటి సంఘాలకే అప్పగిస్తామని వారికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


అనంతపురం జిల్లాను హార్టికల్చర్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తామని ఆ ప్రాంత ప్రజలకు సీఎం భరోసా ఇచ్చారు. సమయానికి రబీ, ఖరీఫ్‌ సాగుకు నీరిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలంటూ రైతులకు ఆయన సూచించారు. రైతులు ఎక్కువ ఆదాయం పొందేలా కార్యాచరణ చేపడతామన్నారు. ప్రకృతి సేద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ రైతులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

Updated Date - Feb 05 , 2026 | 08:56 PM