Share News

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

ABN , Publish Date - Feb 05 , 2026 | 02:43 PM

వైసీపీ పాలనలో ఐదేళ్లు తిరుమలకు భక్తులు రావాలంటే అనుమానించే పరిస్థితి ఏర్పడిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ వాళ్లు.. తనతోనే కాకుండా దేవుడితోనూ పెట్టుకున్నారని విమర్శించారు.

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం

అమరావతి, ఫిబ్రవరి 05: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని తెలిపారు. గురువారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ విషయంలో తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన కుండుబద్దలు కొట్టారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తప్పులు చేసి.. తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. దుర్మార్గాలు చేసి తిరిగి తమపై ఎదురుదాడి చేస్తున్నారని వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా ఏపీ సీఎం ఎండగట్టారు.


వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు.. భక్తులు తిరుమలకు రావాలంటేనే అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు చంద్రబాబు. వైసీపీ వాళ్లు.. తనతోనే కాకుండా దేవుడితోనూ పెట్టుకున్నారని తెలిపారు. వైఎస్ జగన్ అన్యమతస్థుడు కావచ్చు.. కానీ డిక్లరేషన్‌ ఇచ్చి ఆయన దర్శనం చేసుకోవాల్సి ఉంటుందన్నారు. శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు. రసాయనాలు కలిపారని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఉందని స్పష్టం చేశారు. ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పారా? అని సీఎం ప్రశ్నించారు. ఈ మహాపాపంపై ప్రతి ఒక్కరూ చర్చించాలన్నారు.


'మాపైనే ఎదురుదాడి చేస్తారా? మీకు ఈ ధైర్యం ఎవరిచ్చారు?' అంటూ వైసీపీ నేతలను సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. 'పరకామణి కేసును సెటిల్‌మెంట్‌ చేసి సమర్థిస్తారా?' అని వైసీపీ అగ్రనేతల వైఖరిని తప్పుబట్టారు సీఎం. అలాగే దొంగతనం చేసిన వారిని సమర్థిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వేంకటేశ్వర స్వామిపై దాడేనని ఆయన అభివర్ణించారు. 'మహా పాపం చేశారు.. క్షమాపణలు చెప్పాలి' అంటూ వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.


తప్పు చేసినవారికి దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో మీరే చూస్తారన్నారు ముఖ్యమంత్రి. దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనుకునే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దోషులను కచ్చితంగా శిక్షిస్తామన్నారు. దేవుడి పవిత్రతను కాపాడలేనంత అసమర్థులం కాదన్న చంద్రబాబు.. కూటమి నేతలు ఎక్కడైనా బూతులు మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతూనే ఉన్నారంటూ మండిపడ్డారు.


ఇక.. తిరుమలలో ఇటీవల కొన్ని అపచారాలు జరిగాయని చంద్రబాబు అన్నారు. లడ్డూ కల్తీ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. 2003లో తనపై హత్యాయత్నం జరిగితే శ్రీవారే కాపాడారని.. అలాగే గతంలో ఏడుకొండలు కాదు.. రెండు కొండలని మాట్లాడారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. వైసీపీ పాలనలో వారి ప్రవర్తన పరాకాష్ఠకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థంలో రాముడి తల తీసేశారని.. ప్రశ్నిస్తే తనపై కేసు పెట్టారని చెప్పారు. అంతర్వేది, దుర్గగుడిలో దుర్మార్గాలపై చర్యలు తీసుకోలేదని వివరించారు.


మరోవైపు 2022లో CFTRI రిపోర్ట్‌లో కల్తీ జరుగుతోందంటే.. ఆ నివేదికను కావాలనే తొక్కి పెట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. తాను సీఎం కాగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రారంభించానని వివరించారు. నెయ్యిలో పొరపాట్లు జరుగుతున్నాయని శాంపిల్స్‌ నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు(NDDB)కి పంపామన్నారు. వైసీపీ తప్పుచేసి తిరిగి మమ్మల్నే క్షమాపణలు చెప్పమంటున్నారని పేర్కొన్నారు. బూతులు తిడితే నోరుమూసుకుని కూర్చోవాలంటున్నారంటూ వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరును ఈ సందర్భంగా చంద్రబాబు వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

For More AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 03:21 PM