వైసీపీలో మనోవేదనకు గురయ్యా.. ఏపీలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ పెడతా: విజయసాయి
ABN , Publish Date - Nov 02 , 2026 | 01:37 PM
వైసీపీలో చాలా మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతుందని ప్రకటించారు.
విజయవాడ, నవంబర్ 2: వైసీపీలో చాలా మనోవేదనకు గురైనట్లు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవతరించబోతుందని ప్రకటించారు. ఈనెల11న కొత్త పార్టీ పేరు ప్రకటిస్తానని.. అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. టీటీడీ బోర్డులో తాను, ఓవీ రమణ పనిచేశామని.. టీటీడీ అభివృద్ధిలో తాము భాగస్వామ్యంతో సమర్ధవంతంగా పని చేశామనే ఆత్మసంతృప్తి ఉందన్నారు. తాను ప్రకటించే పార్టీలో రమణ చేరాలని నిర్ణయించడం చాలా సంతోషమన్నారు. వైసీపీలో తాను నేషనల్ జనరల్ సెక్రటరీగా పని చేశానని.. ఇప్పుడు కొత్త పార్టీలో రమణ కూడా అదే పోస్ట్‌లో ఉంటారని చెప్పారు. ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కొత్తపార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ ఆవిర్భావం తరువాత చేరికలు ఉంటాయని వివరించారు. మిత్రుడు రమణతో కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
ఆ ట్రోల్స్‌పై వివరణ..
నవంబర్ 11వ తేదీ.. 11 గంటలు.. 11 నిమిషాలు.. 11 సెకన్లపై వస్తున్న ట్రోల్స్ గురించి మాజీ ఎంపీ వివరణ ఇచ్చారు. ‘నేను ఎవరినీ కించ పరిచేందుకు ఇలా పెట్టలేదు. మాకు మూహూర్త బలం అలా వచ్చిందని పండితులు చెప్పారు. ఆ ప్రకారం నేను 11-11-26 న 11 గంటల, 11 నిమిషాల, 11 సెకన్లకు కొత్త పార్టీ ప్రకటిస్తా. ఎవరో భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను. నేను మెంటార్‌గా ఉండి.. అన్ని వర్గాల వారికి అధికారం కట్టబెట్టేలా పని చేస్తా. ప్రజల ఆశీర్వాదంతో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగి చూపిస్తాం’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
రాప్తాడు దాడిలో స్నేహితురాలి సాహసం.. లక్ష్మి ధైర్యానికి మంత్రి లోకేశ్ ప్రశంసలు
‘రాప్తాడు బాలిక ఆరోగ్యం మెరుగుపడుతోంది’.. ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్
Read Latest AP News And Telugu News