Share News

జగన్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావు: వర్ల రామయ్య

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:43 PM

మాజీ సీఎం జగన్‌పై వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును శత్రువుగా భావించిన జగన్.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి 53 రోజుల పాటు జైలుకు పంపారని మండిపడ్డారు.

జగన్.. ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావు: వర్ల రామయ్య
TDP Leader Varla Ramayya

అమరావతి, ఫిబ్రవరి 2: స్కిల్ డెవలమెంట్ కేసుకు సంబంధించి మాజీ సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ను వివిధ కులాలకు చెందిన ముఖ్యమంత్రులు.. రెడ్లు, బ్రాహ్మణులు, దళితులు, వెలమలు, బీసీలు, వైశ్యులు, కమ్మ వర్గాల వారు పరిపాలించారని, కానీ వారంతా రాజకీయ పోరాటాలు మాత్రమే చేశారని ఆయన అన్నారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో కక్షలు, కార్పణ్యాలు, పగ, ద్వేషం, ప్రతీకారం, విధ్వంసం, ఫ్యాక్షనిజం, రాక్షస పరిపాలనకు తెర లేచిందని వ్యాఖ్యానించారు.


అందులో భాగంగానే తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడును శత్రువుగా భావించిన జగన్.. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి 53 రోజుల పాటు జైలుకు పంపారని మండిపడ్డారు. జైలులో బక్కెట్ వేడి నీళ్లు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి, మానసికంగా బాధలు కలిగించి కక్ష తీర్చుకున్నారని విమర్శించారు.


ఏ సీఐడీ అయితే ఆయన్ను అరెస్ట్ చేసిందో.. ఇప్పుడు అదే సీఐడీ దర్యాప్తు కొనసాగించి, చంద్రబాబుపై ఎలాంటి తప్పు లేదని 'మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్' కింద కేసును వాపసు తీసుకుందని తెలిపారు. ఆయనపై అవినీతి, షెల్ కంపెనీల ద్వారా డబ్బు తరలింపు వంటివి ఏమీ రుజువు కాలేదని స్పష్టం చేసిందని రామయ్య తెలిపారు. ఇటీవల ఈడీ కూడా విశాఖపట్నం కోర్టులో చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసి, మిగతా వ్యక్తులపై మాత్రమే ప్రాసిక్యూషన్ కంప్లెయింట్ దాఖలు చేసిందన్నారు. ఇది జగన్‌కు రెండో చెంపదెబ్బ అంటూ వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.


దర్యాప్తు సంస్థలు స్కిల్ కేసులో చంద్రబాబుకు ఎలాంటి అవినీతి మరక లేదని చెప్పిన నేపథ్యంలో జగన్ ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు జైలులో బందీగా ఉన్న 53 రోజుల జీవన కాలాన్ని కక్ష, కార్పణ్యాల ద్వారా దొంగిలించిన వ్యక్తి జగన్ అని ఆయన ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలన అరాచకమని, అప్రజాస్వామికమని, మహిళల పట్ల జుగుప్సాకరంగా వ్యవహరించిన తీరు గర్హణీయమన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలులో బంధించినందుకు కోట్లాది మంది టీడీపీ కార్యకర్తలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు అభిమానులకు జగన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

లండన్‌కు మంత్రి నారాయణ.. కీలక ప్రాజెక్టుల పరిశీలన

వైసీపీ చర్యలపై అప్రమత్తంగా ఉండండి.. సీనియర్ మంత్రుల హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 02 , 2026 | 04:50 PM