Bhanu Prakash Reddy: అన్నీ తాడేపల్లి ప్యాలెస్‌తోనే లింక్.. త్వరలో శిక్ష తప్పదు: భానుప్రకాశ్ రెడ్డి
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:34 AM
వైసీపీపై భానుప్రకాశ్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని ఆయన ఆరోపించారు.
విజయవాడ, జనవరి 12: వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి(Bhanu Prakash Reddy) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ప్రజల ఆగ్రహంతో పాటు వేంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వారిపై పడిందన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారని, టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని వైసీపీ ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
థెఫ్ట్‌ను గిఫ్ట్‌గా చేసిన వైసీపీ..
పరకామణి విషయంలో చెట్టుకింద పంచాయతీ చేశారని, జగన్‌కు ఆలయ ప్రతిష్ఠ గురించి తెలుసా అని ప్రశ్నించారు భానుప్రకాశ్. హిందువుల మనోభావాలు అంటే అంత దిగజారుడు ఆలోచనలా అని మండిపడ్డారు. గతంలో వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారు మాడి మసయ్యారని, దేశ ద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పుని ఆయన వ్యాఖ్యానించారు. చట్టంలోని లొసుగులతో వైసీపీ నాయకులు విర్రవీగుతున్నారని భానుప్రకాశ్ విమర్శించారు. మద్యం బాటిళ్లు తీసుకెళ్లి టీటీడీ మీద, ధర్మకర్తల మీద నెట్టడం ఎంతవరకు సమంజసమని భూమన కరుణాకర్ రెడ్డిని ప్రశ్నించారాయన. ఆధారాలతో సహా చట్టపరిధిలో శిక్షిస్తామని హెచ్చరించారు. పంచభూతాలు కూడా వైసీపీ నాయకుల కదలికలను గమనిస్తున్నాయని, పరకామణిలో చోరీ కేసులో దొంగను దాతగా చేసింది వైసీపీ అని విమర్శించారు. వైసీపీ.. థెఫ్ట్‌ను గిఫ్ట్‌గా చేసిందంటూ ఆయన కామెంట్స్ చేశారు.
ప్రజలు తన్ని తరిమేయడం ఖాయం..
విధాన విషయాలపై చర్చకు రావాలని.. అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధమని భానుప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు. టీటీడీలో జరిగే ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్‌తో లింక్ అయిఉందని.. రాబోయే రోజుల్లో పాత్రధారులు, సూత్రధారులు, లబ్ధిదారులు అందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. ధార్మిక క్షేత్రంలో గతంలో దాపరికాలు ఉండేవని, తాము ప్రతిదీ వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని ఆయన తెలిపారు. ‘మీరు(వైసీపీ) నిప్పు ఉప్పు అంటే ఎందుకు దాపరికం’ అని ప్రశ్నించారు. అలాగే మున్ముందు వైసీపీ ఇలానే వ్యవహరిస్తే ప్రజలు వారిని తన్ని తరిమేస్తారని బీజేపీ హెచ్చరిస్తోందని అన్నారు. రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
దుర్గగుడిలో అపచార ఘటనపై ఈవో తాజా ఆదేశాలివే..
Read Latest AP News And Telugu News