Central Ground Water Board: కలుషిత జలం.. కాలకూట విషం..!
ABN , Publish Date - Jan 12 , 2026 | 07:03 AM
దేశంలోని మంచినీటి వనరులను కాలుష్యం ముంచెత్తుతోంది. నదులు, చెరువుల్లో నీటి నాణ్యత దిగజారిపోతోంది. తాగునీరు కాలకూట విషంగా మారుతోంది.
దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న భార జలం
ఏపీతో పాటు రాజస్థాన్, హరియాణాల్లో పెరుగుతున్న ఈసీ, ఫ్లోరైడ్ పరిమాణం
అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): దేశంలోని మంచినీటి వనరులను కాలుష్యం ముంచెత్తుతోంది. నదులు, చెరువుల్లో నీటి నాణ్యత దిగజారిపోతోంది. తాగునీరు కాలకూట విషంగా మారుతోంది. 2023-24లో అధ్యయనం చేసిన కేంద్ర భూగర్భ జలాల మండలి(సీజీడబ్ల్యూబీ) పలు రాష్ట్రాల్లో నీటి కాలుష్యం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. చా లా రాష్ట్రాలకు భారజలాలు విస్తరిస్తున్నాయని 2025లో విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. ఏపీతో పాటు రాజస్థాన్, హరియాణాల్లోని జలాల్లో అత్యధిక ఎలక్ర్టికల్ కండక్టివిటీ(ఈసీ), ఫ్లోరైడ్ పరిమాణం మోతాదుకు మించి ఉందని తెలిపింది. రసాయన చర్యల కారణంగా నీరు కలుషిత స్థా యిని మించి విషంగా మారుతోందని హెచ్చరించింది. ఈ అధ్యయనం కోసం దేశీయంగా 15,259 నీటి శాంపిళ్లను ఈ సంస్థ సేకరించింది. వాటిలో నాలుగో వంతు నమూనాల్లో జలాలు పూర్తి కాలుష్యంతో ఉన్నాయని స్పష్టం చేసింది. దాదాపు 20.7 శాతం నీటి నమూనాల్లో నైట్రేట్ విలువ లీటరు నీటిలో పరిమితి(45ఎంజీ/ఎల్)కి మించి అధిక స్థా యిలో ఉంది. ఏపీతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, కర్ణాటక, హరియాణా, ఉత్తరప్రదే శ్ రాష్ట్రాల్లో నైట్రేట్ శాతం అత్యధికంగా నమోదైంది.
అలాగే 8.05 శాతం నమూనాల్లో సురక్షిత స్థాయి కంటే ఫ్లోరైడ్ ఎక్కువగా ఉందని తెలిపింది. మరో 7.23 శాతం నమూనాల్లో ఈసీ(ఎలక్ట్రికల్ కండక్టివిటీ) కాలుష్యాన్ని గుర్తించినట్లు పేర్కొంది. రాజస్థాన్, గుజరాత్ అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటున్నాయని వెల్లడించింది. సహజంగా రుతుపవనాలకు ముందు భూగర్భ జలాల్లో ఈసీ అధికంగా ఉంటుందని, వర్షాలతో దీని ప్రభావం బాగా తగ్గుతుందని వెల్లడించింది. అయితే ఇటీవల కాలంలో అడవుల నరికివేత, గనుల తవ్వకాలు, విచ్చలవిడిగా కాలుష్యకారక పదార్థాలను నీటి వనరుల్లో పడేయడంతో వర్షాకాలం తర్వాత కూడా భారజలాలు పెరిగిపోతున్నాయని పేర్కొంది. ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, హరియాణాల్లోని జలాల్లో యురేనియం శాతం క్రమంగా ఎక్కువ అవుతోందని వెల్లడించింది. సాగుకు వినియోగించే నీటిలో 98.9 శాతం రసాయనాల ప్రభావం లేదని పేర్కొంది. కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.