ప్రపంచ స్థాయిలో ఉండేలా అమరావతి నిర్మాణం: ఎంపీ అప్పలనాయుడు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:49 PM
ఏపీలో జగన్ పాలనను తిరస్కరించి ప్రజలు బుద్ధి చెప్పారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఎంపీ ఆరోపించారు.
న్యూఢిల్లీ, జవనరి 29: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(Former CM YS Jagan Mohan Reddy) టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. జగన్ బెంగళూరులో ఉంటూ.. అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి రాష్ట్ర సంబంధిత అంశాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం 19 నెలల్లో 10 రోజులైనా ఆంధ్రప్రదేశ్‌లో నివాసమున్నారా? అని జగన్‌ను ప్రశ్నించారు ఎంపీ. కనీసం ఈ రాష్ట్రం గురించి వైసీపీ అధినేతకు తెలుసా అని నిలదీశారు. రాష్ట్రంలో జగన్ పాలనను ప్రజలు తిరస్కరించి బుద్ధి చెప్పారని అన్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ తెలిపారు.
ఆ విషయం సీఎంకు తెలుసు..
జగన్ పాలనలో చేసిన అప్పులను తీర్చేందుకు.. చంద్రబాబు అనుభవం, వ్యూహాలతో రాష్ట్రాన్ని గాడినపెట్టారని అప్పలనాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరగొద్దని, పారిశ్రామికవేత్తలు రావొద్దని జగన్ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం దావోస్‌కు ఎక్కువసార్లు వెళ్లిన సీఎంలు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమేనని.. పారిశ్రామిక అభివృద్ధి జరిగితే రాష్ట్ర పురోగతి సాధ్యమవుతుందని ఆయనకు తెలుసన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన అభివృద్ధికి నాంది పలుకుతున్న పరిస్థితి ఉందని చెప్పారు.
భక్తులకు సమాధానం చెప్పండి..
జగన్ ముఠా సభ్యులు మాట్లాడుతున్న తీరుపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి జరిగిందని ఆరోపణలు చేసి దొరికిపోయిన సందర్భాలు చూశామని, ఏదీ జరగలేదని వారు మీడియా, సోషల్ మీడియాల ద్వారా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ ఆధారాలతో సహా నిరూపించిందన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారని.. వారికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో తిరుమలను ఆదాయంగా మార్చి.. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపించారు. జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.
టీడీపీది కీలక పాత్ర..
దేశం, రాష్ట్ర అభివృద్ధిలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తోందని అప్పలనాయుడు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు.. నాలుగు పిల్లర్లుగా రాష్ట్రాన్ని దేశంలో ఉన్నతస్థానానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు. అమరావతిలో బ్రహ్మాండంగా, ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా నిర్మాణం జరుగుతోందన్నారు. పోలవరం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, రాయలసీమ అభివృద్ధి చూసి ఓర్వలేక జగన్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీ లిక్కర్ కేసు.. ముగ్గురికి బెయిల్.. మరో ఇద్దరికి షాక్
ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..
Read Latest AP News And Telugu News