సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక మలుపు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 09:06 PM
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడు సురేశ్‌కు కోర్టు సెప్టెంబర్ 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో సురేశ్‌ను నూజివీడు జైలుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తరలించారు.
విజయవాడ, సెప్టెంబర్18: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక నిందితుడు సురేశ్‌కు కోర్టు సెప్టెంబర్ 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో సురేశ్‌ను నూజివీడు జైలుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తరలించారు. ఈ కేసులో సురేశ్ ఏ4 నిందితుడిగా ఉన్నారు. సురేశ్ రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను సిట్ అధికారులు పొందుపరిచారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ చనిపోలేదని రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. ఆ పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణను సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని దారుణంగా కొట్టారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాయికృష్ణను సీఐ నాగరాజు ఆదేశాలతో రాణిగారి తోటలోని పాత భవనానికి తరలించారు.
ఈ ఏడాది మే12వ తేదీన సీఐ నాగరాజును కలవడానికి సురేశ్.. రాణిగారి తోటలోని ఆ భవనానికి వెళ్లాడు. అక్కడ సాయి కృష్ణను సురేశ్ చూశాడు. అత్యంత దయనీయ స్థితిలో సాయికృష్ణ ఉన్నాడు. తనను చంపడానికే ఇలా కొడుతున్నారంటూ సురేశ్‌కు సాయికృష్ణ స్వయంగా చెప్పాడు.
సురేశ్‌తో మాట్లాడుతూనే సాయికృష్ణ స్పృహ తప్పి పడిపోయి మరణించాడు. దీంతో అదే రోజు (12-05-2026) అర్ధరాత్రి సాయికృష్ణ మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి మోటార్ సైకిల్‌పై తరలించారు. స్వర్గపురిలో సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, సురేశ్ కలిసి దహనం చేశారు.
మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు సురేశ్, అశోక్, సీఐ నాగరాజు స్వర్గపురిలోనే ఉన్నారు. 18వ తేదీన స్వర్గపురికి సురేశ్ వెళ్లి సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయా? అని పరిశీలించి వచ్చాడు. A1 సీఐ నాగరాజుకు A4 సురేశ్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నాడు. కృష్ణలంక సీఐ నాగరాజుతో కలిసి సురేశ్ నైట్ రౌండ్స్‌కు వెళ్లేవాడు. 7-05-2026వ తేదీన సాయికృష్ణను సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విచారించడం సురేశ్ చూశాడు.
సీఐ నాగరాజు ఆదేశాలతోనే సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ సెల్ ఫోన్ నుంచి తొలగించారు. సాయికృష్ణను పోలీసుస్టేషన్‌లో ఉంచితే అనుమానం వస్తుందని సీఐ నాగరాజు రాణిగారితోటలో ఒక ప్రవేట్ పాడుబడ్డ భవనానికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఖేలో ఇండియా గేమ్స్ విజయవంతం చేయాలి: అధికారులను ఆదేశించిన సంజయ్ జాజు
టీజీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా
For More TG News And Telugu News