మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:31 PM
దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు.
అమరావతి, జూన్ 10: దేశ సేవలో ప్రధాని మోదీ 4,399 రోజుల పాలన పూర్తి అయ్యిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ స్పందిస్తూ.. మోదీ సేవలను కొనియాడారు. ‘మాతృభూమిపై గౌరవం.. కర్మభూమిపై సంక్షేమం.. దేశానికే అంకితమైన జీవితం’ అని అన్నారు. దేశానికి నిస్వార్థ సేవ చేస్తున్న ప్రధానమంత్రి మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 12 ఏళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌ను బలమైన దేశంగా తీర్చిదిద్దిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ భద్రత మరింత పటిష్ఠమైందని, ఆధునికీకరణ దిశగా భారత సాయుధ దళాలకు కొత్త శక్తి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌కు కీలక స్థానం లభించిందని, జీ-20 సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దృష్టి భారత్ వైపు మళ్లిందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్‌కు బలమైన స్వరంగా భారత్ ఎదిగిందని వ్యాఖ్యానించారు.
డిజిటల్ ఇండియా విప్లవం ద్వారా ప్రజలకు సేవలు చేరువయ్యాయని పవన్ అన్నారు. జనధన్-ఆధార్-మొబైల్ (JAM) అనుసంధానంతో పారదర్శక పాలన సాధ్యమైందని చెప్పారు. యూపీఐ, డీబీటీ వ్యవస్థలతో డిజిటల్ చెల్లింపులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కింద కోట్ల మందికి వైద్య భరోసా లభిస్తోందన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు సొంత ఇళ్ల కల సాకారమవుతోందని పవన్ ప్రస్తావించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు సదుపాయం కల్పించారన్నారు. జాతీయ రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాల్లో భారీ అభివృద్ధి సాధించారని చెప్పారు. వందే భారత్ రైళ్లతో రవాణా రంగంలో కొత్త శకం మొదలైందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తున్న సహకారం అభినందనీయమని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యంతో రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వికసిత భారత్ 2047 సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామ్యం వహిస్తుందన్నారు. భిన్నత్వమే భారతదేశ బలమని, భాషలు భారత గర్వకారణమన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని, విభజన శక్తులను ధీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. జై హింద్.. జై భారత్ అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్
భారతీరాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం
Read Latest AP News And Telugu News