ఆర్థిక వృద్ధి విశ్లేషణకు నెలవారీ నివేదికలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 06:05 AM
రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు నెలవారీ నివేదికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో..
డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జీఎస్టీ, పన్ను వసూళ్లలో సాంకేతికత వినియోగం
జీఎస్డీపీపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, జూన్ 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థూల ఉత్పత్తి, ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు నెలవారీ నివేదికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీలక సూచీలపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రస్థాయి, క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లేషించేందుకు ప్రతినెలా నిర్దేశిత తేదీన నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరంలో నమోదయ్యే వివిధ గణాంకాల ద్వారా ఎప్పటికప్పుడు జీఎస్డీపీ లక్ష్యాన్ని సమీక్షించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర, జిల్లా, మండలస్థాయిలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కీలక సూచీలు మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సూచనలు చేశారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచీలను మరింత మెరుగుపరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాల రూపకల్పనపై ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. నిర్దేశించుకున్న లక్ష్యాలతో పాటు వాస్తవ వృద్ధి ఆధారంగా పనితీరు అంచనా వేసేలా స్కోరింగ్ విధానం అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై చేసే వ్యయంపై 3.5 రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు రియల్ టైమ్‌లో ఒక ఏఐ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. డేటా ఆధారిత పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రంగంలోని ఉత్పత్తుల స్థూల విలువను పెంచడంపై శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. తయారీ రంగం, గనులు, వాణిజ్యం, రవాణా తదితర రంగాలతో పాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్‌పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సామర్థ్యాల పెంపుపై జూలై 2, 3 తేదీల్లో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించారు. జీఎస్టీ సహా పన్ను వసూళ్లలో పూర్తి సాంకేతికతను వినియోగించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.