కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 15 , 2026 | 09:52 AM
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు.
విజయవాడ, ఆగస్టు 15: కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొని.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఇక్కడ వాతావరణం చూశాక స్కూల్ రోజులు గుర్తుకు వచ్చాయని తెలిపారు. జెండాలు కట్టి, పోటీల్లో పాల్గొని జెండా పండుగ రోజు బహుమతులు అందుకునే వాళ్లమని చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రతి ఇంటి పైనా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలిపారు.
విద్యాశాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం..
అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంత్రి కొనియాడారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో స్వాతంత్ర్యం కోసం పోరాడారన్నారు. మువ్వన్నెల జెండా మన ఆత్మ విశ్వాసంగా పేర్కొన్నారు. పింగళి వెంకయ్య, టంగుటూరి ప్రకాశం పంతులు అందరికీ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ నడయాడిన జిల్లాలో జాతీయ పతాకం ఎగురవేయడం ఆనందంగా ఉందన్నారు. విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు. ‘మహిళలను గౌరవించండి.. భరోసా కలిగించండి’ అని పిలుపునిచ్చారు.
చంద్రబాబే ఆకా కిరణం..
రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టామని.. అనేక ఖాళీలను భర్తీ చేసేలా ముందుకు సాగుతున్నామని లోకేశ్ వెల్లడించారు. ప్రధాని మోదీ అండగా ఉంటూ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారన్నారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించారని తెలిపారు. పోలవరం పూర్తి చేస్తున్నామని.. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడామని చెప్పుకొచ్చారు. పొట్టి శ్రీరాములు త్యాగాల ఫలితంగా నాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని.. హైదరాబాద్‌ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. 2014 లో రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా చేసి మెడపట్టి గెంటేశారని.. ఆరోజు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఒక్కరే మనకి ఆశా కిరణమని అన్నారు.
20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం...
2014-2019 మధ్య ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు ఎంతో తపనపడ్డారని మంత్రి తెలిపారు. 2019 తరువాత వచ్చిన ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 2024 తరువాత సీఎంగా చంద్రబాబు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఏడు పదులు దాటినా కుర్రాడిలా పరుగులు పెడుతున్నారని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని, పోలీసు శాఖలో ఖాళీలు భర్తీ చేశామన్నారు. గూగుల్ తెచ్చిన సమయంలో ఎంతో ఆనందం కలిగిందని అన్నారు. చంద్రబాబు అభినందిస్తారనుకుంటే.. లక్ష్యాన్ని నిర్దేశించారని తెలిపారు. ఏపీలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ భక్తితో పాటు రాష్ట్ర భక్తి కూడా ఉండాలన్నారు.
2024 నాటికి వికసిత ఏపీని సాధిద్దాం...
నేడు భారతదేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతోందని.. ఏపీ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం కాదని.. అమరావతి, విశాఖపట్నం, కర్నూలులో ఉద్యోగాలు చేయాలని యువతకు పిలుపునిచ్చారు. కసితో పని చేసి 2047 నాటికి వికసిత ఏపీని సాధించాలన్నారు. స్వర్ణాంధ్రకు తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. పక్క రాష్ట్రం వాళ్లు అసూయపడేలా ఏపీ అభివృద్ధి చెందాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ, కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
దేశ భవిష్యత్తును మరింత గొప్పగా నిర్మించడమే మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి: సీఎం చంద్రబాబు
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News