అంధత్వాన్ని ఆత్మవిశ్వాసంతో గెలిచాడు!
ABN , Publish Date - Sep 20 , 2026 | 09:24 AM
పుట్టుకతోనే చూపులేదు... ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేశాడు. కళ్లు లేని వాడికి ఇంజినీరింగ్ చదువెందుకు అన్నవారికి... కోర్టు ద్వారా పోరాడి సమాధానం ఇప్పించాడు.
పుట్టుకతోనే చూపులేదు... ఆత్మస్థయిర్యంతో ముందడుగు వేశాడు. కళ్లు లేని వాడికి ఇంజినీరింగ్ చదువెందుకు అన్నవారికి... కోర్టు ద్వారా పోరాడి సమాధానం ఇప్పించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ జేపీ మోర్గన్‌లో టెక్నికల్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న నాగబాబు జన్ను కలల ప్రయాణం... ఆద్యంతం స్ఫూర్తిదాయకం. ఆ విజయగాథ అతని మాటల్లోనే...
‘‘మాది కృష్ణాజిల్లా ఉయ్యూరు దగ్గర జుజ్జువరం. పుట్టిన వెంటనే నాకు కళ్లు లేవని డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలిసి అమ్మ బాధపడుతుంటే... ‘ఇక వాడు అడుక్కు తినాల్సిందే’నంటూ ఎగతాళి చేశారట. నాకు ఆరేళ్లు ఉన్నప్పుడు దారుల్‌షిఫా బ్లైండ్ స్కూల్‌లో చేర్పించాలని మా కుటుంబం హైదరాబాద్‌కి చేరింది. నాన్నకి సైకిల్ రిపేర్ చేయడం తప్ప ఏమీ రాదు. అమ్మకు కుట్టు పని వచ్చు. మేమిక్కడికి వచ్చాక నాన్న తాగుడుకు బానిస అయ్యాడు.
ఒక్క మార్కు వల్ల...
ఇంట్లో తరచూ జరిగే గొడవల వల్ల అమ్మ వేదనకు గురయ్యేది. ఆ గొడవల మఽధ్యే నా చదువు ప్రయాణం మొదలైంది. బ్రెయిలీ లిపి, టేలర్స్ బోర్డుతో నేర్చుకున్న లెక్కలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఆ తర్వాతికాలంలో హాస్టల్ జీవితం నన్ను క్రమశిక్షణలో పెట్టింది. నేను ఏడో తరగతి వచ్చేసరికి నాకిద్దరు చెల్లెళ్లు. ఒక చెల్లికి నాలాగే కళ్లు లేవు. అందుకే అమ్మ మా ఇద్దరినీ దేవ్‌నార్ స్కూలులో చేర్పించాలనుకుంది. అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివిన నేను, అక్కడ ఇంగ్లిష్ మీడియంలో చేరాను. మొదటి యూనిట్ టెస్ట్‌లో సోషల్‌లో ఒక్క మార్కే వచ్చింది. అందరూ గేలిచేశారు. దాంతో కసిగా చదవాలని నిర్ణయించుకున్నా.

కంప్యూటర్ పరిచయం...
తొమ్మిదో తరగతిలో ఉండగా నాకు మొదటి సారి కంప్యూటర్ పరిచయం అయింది. స్ర్కీన్ మీద వచ్చే ప్రతీ అక్షరాన్ని అంఽధుల కోసం చదివి వినిపించే జావ్స్ (జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్) వల్ల నాకు దాని మీద ఇష్టం పెరిగింది. కంప్యూటర్ ద్వారా న్యూస్ వినడం, కొత్త విషయాలను తెలుసుకోవడం మొదలెట్టాను. అప్పుడే పాలిటెక్నిక్‌లో కంప్యూటర్ ఇంజినీరింగ్ చేయాలని నిర్ణయించుకొన్నా. పాలిసెట్‌లో మంచి ర్యాంకు వచ్చింది. కౌన్సెలింగ్‌కి వెళితే కళ్లులేవని సీటివ్వమన్నారు. ‘డిజేబుల్డ్ యాక్ట్ 1995 ప్రకారం వికలాంగులపైన ఇలాంటి వివక్ష ఉండకూడదు’ అని వాదిస్తే నన్ను చేర్చాలని లెటరిచ్చారు. కానీ కౌన్సెలింగ్ బోర్డ్ పట్టించుకోలేదు. ఈసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నుంచి లెటర్ తేవడంతో గుడ్లవల్లేరులోని పాలిటెక్నిక్‌లో సీటిచ్చారు. అక్కడ టీచర్లు, ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంతో సహకరించారు.
- కథ మళ్లీ మొదటికి...
బీటెక్ చదువాలన్నది నా కల. ఈసెట్ ప్రవేశ పరీక్షకి సిద్ధమయ్యా. రెండు రోజుల ముందు పరీక్ష రాయడానికి స్ర్కైబ్ (సహాయకులు) కావాలని జేఎన్‌టీయూకి వెళ్లా. అక్కడ నాకు ఎంట్రన్స్ రాసే అర్హతే లేదన్నారు. ఈ విషయాన్ని దేవ్‌నార్‌లోని స్వర్ణలత టీచర్‌కి చెప్పా. ఆవిడ ఆమె భర్త నాతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఆ రాత్రే పరీక్ష రాయించాలని హైకోర్టు ఆదేశించింది. నేను పరీక్ష రాసినా సరే, రిజల్ట్ ఆపేశారు. తిరిగి నేను హైకోర్టుకి వెళితే కానీ నా రిజల్ట్ విడుదల చేయలేదు. రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకు వచ్చిందని తెలిసింది. ఆ తర్వాత కౌన్సెలింగ్‌కి వెళితే అనుమతించలేదు. ఈసారి టెక్నికల్ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిస్తే, నాకు టెస్ట్ పెట్టి తీసుకోవడానికి అనుమతించాలని ఆదేశించారు.
ముచ్చటగా మూడోసారి...
జేఎన్‌టీయూలో ఆరుగంటల పాటు ప్రొఫెసర్లు నన్ను పరీక్షించారు. రకరకాల కమాండ్స్ ఇచ్చి చేయగలనో లేదో చూశారు. జావ్స్ సాయంతో నేను వాళ్లు పెట్టిన పరీక్షలను ఎదుర్కొన్నా. ఈ రిజల్ట్ వచ్చాక గుడ్లవల్లేరు కాలేజీలోనే బీటెక్‌లో జాయిన్ అవ్వాలంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కాకపోతే నేను ఆలస్యంగా జాయిన్ అవ్వడంతో మొదటి సెమిస్టర్ పరీక్షకు అనర్హుడని అన్నారు. దాంతో మూడోసారి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. నాకు అనుకూలంగా తీర్పు వచ్చేసరికి, రెండో సెమిస్టర్ వచ్చేసింది. దీంతో నేను ఒకేసారి రెండు సెమిస్టర్ పరీక్షలను కష్టపడి చదివి బ్యాక్‌లాగ్స్ ఏమీ లేకుండా పాసయ్యా. అలా నా ఇంజినీరింగ్ కూడా పూర్తయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోనే వందశాతం అంధత్వంతో ఇంజినీరింగ్ పూర్తిచేసిన తొలి విద్యార్థిని నేనే. కాలేజ్‌లో ఉండగానే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా విప్రోలో సెలెక్ట్ అయ్యాను. అయితే అక్కడా సవాళ్లు మొదలయ్యాయి.
క్యాన్సర్ రూపంలో...
ఉద్యోగం కూడా నాకు అంతా ఈజీగా రాలేదు. మళ్లీ పరీక్షలు పెట్టాక తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మాంద్యం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నాన్న నాకు కంప్యూటర్ కొనిచ్చాడు. దాంతో పిల్లలకు కోర్సు నేర్పించా. కాలేజ్‌లో లెక్చరర్‌గా కూడా చేశా. రెండేళ్లకు విప్రో నుంచి పిలుపు వచ్చింది. అక్కడ డెవలపర్‌గా మొదలైన నా కెరీర్... టీమ్‌లీడ్‌గా, పలు పదవులతో ఎదిగాను. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో చేరా. అప్పుడే అమెరికా వెళ్లేందుకు కూడా ఆఫర్ వచ్చింది. కానీ నా కుటుంబానికి నా అవసరం ఉందని అనిపించి ఆగిపోయా. ఇప్పుడు జేపీ మోర్గాన్‌లో టెక్నికల్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నా.
అంతా బాగుందనుకున్న సమయంలో వెన్నెముకలో ఎల్-3, ఎల్-4 డిస్కులు అరిగిపోయాయని, ఆపరేషన్ చేశారు. కోలుకుంటుండగా థైరాయిడ్ క్యాన్సర్ అటాక్ అయింది. కీమోలు ఎక్కించారు. మొత్తానికి క్యాన్సర్ నుంచి కూడా కోలుకొన్నా. నా జీవన ప్రయాణాన్ని ‘ద అన్‌సీన్ పాత్’ అనే పుస్తకం రాశా.
కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు, వాళ్లని వాళ్లు హింసించుకోవడం చేస్తున్నారు. ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. దాన్ని సహనంతో సాధించుకుంటే... జీవితం గొప్పదనం అర్థమవుతుంది.’’
అచ్చంగా అమ్మలాగే...
నా భార్య రేఖ గురించి చెప్పాలంటే...
నేను పెట్టిన కంప్యూటర్ ఇనిస్టిట్యూట్‌లో పరిచయం. నాకు ఉద్యోగం రావడానికి ఆలస్యమైనప్పుడు తన మాటలే నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంట్లో పెద్దలను ఎదిరించి నాతో పాటు వచ్చేసింది. ఇప్పటిదాకా వాళ్ల పుట్టింటి నుంచి పిలుపు లేదు. అయినా నా కోసం అచ్చంగా అమ్మలాగే నా వెన్నంటి నడిచింది. మాకు ఒక పాప.
ఈ వార్తలు కూడా చదవండి:
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి
Read Latest AP News And Telangana News And International News And Telugu News