Share News

వారి ఉనికిని కాపాడుకోడానికే దాడులు.. వైసీపీపై ఎంపీ అప్పలనాయుడు విమర్శలు

ABN , Publish Date - Apr 08 , 2026 | 03:24 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు.

వారి ఉనికిని కాపాడుకోడానికే దాడులు.. వైసీపీపై ఎంపీ అప్పలనాయుడు విమర్శలు
MP kalisetti appalanaidu

అమరావతి, ఏప్రిల్ 8: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు చేస్తున్న దాడులను ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu) ఖండించారు. ఇది ఒక కార్యాలయంపై దాడి కాదని.. ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు. ‘రాజధానిగా అమరావతి చట్టబద్ధత అవుతున్న సమయంలో మీ సొంత ఎజెండాతో ప్రకటించిన విషయాలపై నవ్వులపాలయ్యారు.. దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ దాడులు చేస్తున్నారు. మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముందు మీ ఇంటి నుంచి మొదలుపెట్టండి. మీ తల్లి, చెల్లెలికి న్యాయం చేయండి. మీ ఇంటి నుంచే మహిళలను కించపరిచే విధానానికి శ్రీకారం చుట్టారు. మహిళలను అన్ని విధాలా కించపరచడానికి నాంది పలికింది వైసీపీ నాయకులు’ అంటూ విమర్శించారు.


అందరూ ఖండించాలి...

గత ప్రభుత్వంలో అమరావతి రైతులను పోలీసు యంత్రాంగంతో అణచివేసి అవమానించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి భార్య, తల్లిని అవమానపరచారని మండిపడ్డారు. దానిపై ఇంతవరకు క్షమాపణ చెప్పకుండా ఇప్పుడు మహిళల గురించి మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులు కూడా ఈ చర్యలను ఖండించే పరిస్థితికి వచ్చిందన్నారు. వైసీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా చేస్తున్న దాడులను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.


పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు...

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎంపీ అప్పలనాయుడు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న వారు పత్రికా యాజమాన్యాలపై దాడి చేస్తూ, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని విమర్శించారు. రాజకీయాలను తప్పుదారి పట్టించి ప్రయోజనాలు పొందాలని ఆలోచిస్తే.. ప్రజలు చాలా తెలివైనవారని, దీన్ని తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో చాలా మంది మహిళలు ముందుకు వచ్చి ఆంధ్రజ్యోతికి మద్దతు తెలిపారన్నారు. ప్రజల కోసం ఆలోచించే ఆంధ్రజ్యోతికి తాము అండగా ఉన్నామని వారు చెప్పడం శుభసూచకమని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన

అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 04:01 PM