Share News

అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:33 PM

ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమ్మారెడ్డి పట్టాభి రాం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యం: పట్టాభిరాం
Pattabhi Ram

అమరావతి, ఏప్రిల్ 8: మాజీ సీఎం జగన్, వైసీపీపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రాం(Kommareddy Pattabhi Ram) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చెత్తపైనా పన్ను వేసిన గత వైసీపీ ప్రభుత్వం చెత్తను తొలగించకుండా భారీగా నిల్వలు పెట్టి వెళ్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 100 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించామని... ఇంకా 50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించాల్సి ఉందని వివరించారు. ఇకపై ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెసింగ్ చేసేలా సరికొత్తగా ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పట్టాభి తెలిపారు.


చెత్త నుంచి ఆదాయం...

రాష్ట్ర వ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో రూ.528.65 కోట్ల వ్యయంతో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని పట్టాభి రాం వెల్లడించారు. 5300 టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసేలా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కేంద్రం రూ.213 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.141 కోట్లు నిధులు కేటాయించినట్లు తెలిపారు. జూన్ నుంచి ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. చెత్త నుంచి ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.


వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు...

కెమికల్ ఫర్టిలైజర్‌ను తగ్గించి బయో ఫర్టిలైజర్ వాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పట్టాభి అన్నారు. ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి అతి తక్కువ ధరకే బయో ఫర్టిలైజర్లను రైతులకు అందిస్తామని తెలిపారు. బయో ఫర్టిలైజర్ అమ్మకాలలో 10 శాతం స్వఛ్చాంధ్ర కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందన్నారు. చెత్త నుంచి రీ సైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చెత్త రీ సైక్లింగ్ ద్వారా మున్సిపాలిటీలకు 10 శాతం, స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌కు 10 శాతం చొప్పున ఆదాయం వస్తుందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 చోట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలంతా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని కోరారు. పారిశుద్ధ్యంపై పిల్లలకు అవగాహన కల్పించేందుకు 5 వేల పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో అత్యధిక స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు సాధించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెత్త సేకరణను నిరంతర పర్యవేక్షణకు రియల్ టైం డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నామని కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

అమరావతి పనులపై సమీక్ష.. మంత్రి నారాయణ ఆదేశాలివే

గుంటూరులో అంబటి రాంబాబు వీరంగం.. పోలీసులతో దురుసు ప్రవర్తన

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 08 , 2026 | 03:06 PM