Share News

మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే

ABN , Publish Date - Feb 27 , 2026 | 01:07 PM

తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ శాసనమండలిలో ప్రకటన ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయంపై ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. స్టేట్‌మెంట్‌కు సిద్ధమంటూ రాతపూర్వకంగా లేఖ ఇచ్చారు.

మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు.. విషయం ఇదే
Tirumala Laddu Controversy

అమరావతి, ఫిబ్రవరి 27: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఏపీ శాసనమండలిలో(AP Legislative Council) తీవ్ర గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఈరోజే ప్రకటన ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూల్ 306 నిబంధన కింద తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని మంత్రి రామనారాయణ రెడ్డి నోటీసు ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించి మండలి ఛైర్మన్ మోషేన్ రాజును మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్, సత్య ప్రసాద్‌ కలిశారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మంత్రులు రాతపూర్వక లేఖ ఇచ్చారు. ప్రభుత్వంపై ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మంత్రులు కోరారు.


పయ్యావుల దృష్టికి ఛైర్మన్ వ్యాఖ్యలు..

తిరుమల లడ్డూ ప్రసాదంపై నిన్న(గురువారం) సభలో లఘు చర్చ సందర్భంగా తప్పుడు పత్రం చూపించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారంటూ ఈరోజు మండలిలో ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. సభలో మండలి ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలను శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ ఎమ్మెల్సీలు. ప్రస్తుతం మంత్రి పయ్యావుల కేశవ్ కుటుంబ సభ్యులతో దైవదర్శనానికి వెళ్లారు. అక్కడే మండలి ఛైర్మన్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను తెప్పించుకుని పరిశీలించారు మంత్రి. సభ గౌరవాన్ని నిలిపేందుకు తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలను బహిర్గతం చేస్తానని ఎమ్మెల్సీలకు మంత్రి చెప్పారు. తాను చూపిన స్టేట్‌మెంట్ నిజం కాదని ఛైర్మన్ ఎలా చెబుతారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.


కేంద్ర నిర్ణయాలు కేబినెట్ సెక్రటరీ పేరుతో, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం చీఫ్ సెక్రటరీ పేరుతో, శాసనసభ సమాచారం సెక్రటరీ జనరల్ పేరుతో వెళతాయని కేశవ్ గుర్తు చేశారు. శాసనమండలి కార్యాలయం నుంచి వెళ్లిన లేఖను మండలి ఛైర్మన్ నిర్ణయంగా పరిగణించకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. తాను వచ్చిన తర్వాత అన్ని విషయాలను సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతానని తెలిపారు. ఎవరు సభ గౌరవానికి భంగం కలిగించారో కూడా బహిర్గతం చేస్తానని టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా 943 రకాల సేవలు: మంత్రి లోకేశ్

ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 01:23 PM