Share News

ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:24 PM

కోర్టు ఆదేశాల మేరకు ఆయేషా మీరా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్స్‌లో ఆయేషా మీరా అవశేషాలను తెనాలికి తరలించారు.

ఆయేషా మీరా అవశేషాల అప్పగింత.. తెనాలికి బయలుదేరిన తల్లిదండ్రులు
Ayesha Meera Case

విజయవాడ, ఫిబ్రవరి 27: ఆయేషా మీరా అవశేషాలను (అస్థికలు) తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు అప్పగించారు. కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆయేషా తల్లిదండ్రులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకువెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా ఆమె అవశేషాలతో తెనాలి బయలుదేరారు. కోర్టు ఆదేశాలతో ప్రత్యేక భద్రత నడుమ అంబులెన్స్‌లో ఆయేషా మీరా అవశేషాలను తెనాలికి తరలించారు.


తెనాలిలోని స్మశాన వాటికలో వారి మతాచారం ప్రకారం ఆయేషా మీరా అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చూడాలని అధికారులను కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అంత్యక్రియల ప్రక్రియ మొత్తం సరైన పద్ధతిలో జరుగుతున్నట్లు రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో తప్పనిసరిగా హాజరుకావాలని న్యాయస్థానం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


మాకు అన్యాయం చేశారు: ఆయేషా తల్లి

ఈ సందర్భంగా ఆయేషా తల్లి శంషాద్ బేగం మాట్లాడుతూ.. ‘నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. 18 ఏళ్లుగా పోరాటం చేసినా న్యాయం జరగలేదు. న్యాయం కోసం మేము తిరుగుతుంటే, దోషులు మాత్రం దర్జాగా జల్సాలు చేస్తున్నారు. ఆ దేవుడే దోషులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నా’అని అన్నారు. సీబీఐ కూడా ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిని తేల్చలేదని.. తమకు న్యాయం చేయకపోగా అన్యాయం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలు లేవని చెబుతున్నారని, ధనికులకు మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు. పేదవారికి, మైనార్టీలకు న్యాయం జరగటం లేదని ఆయేషా తల్లి ఆరోపించారు. ఆధారాలు ఉన్నాయని.. ఎఫ్‌ఐఆర్‌లో వయస్సు కూడా తప్పుగా నమోదు చేశారన్నారు. నేరం జరిగిన తర్వాత అన్ని తుడిచేశారని ఆమె తెలిపారు. ఆయేషా కేసులో పోలీసులు పూర్తిగా నిందితులకు సహకరించారని ఆరోపించారు. ఆయేషా అవశేషాల కోసం కోర్టుల చుట్టూ ఏళ్ల క్రితం నుంచి తిరుగుతున్నామని.. న్యాయం కోసం ప్రజలు తిరగబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని శంషాద్ బేగం అన్నారు.


ఇవి కూడా చదవండి..

త్వరలోనే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు

వాట్సాప్ గవర్నెన్స్‌ ద్వారా 943 రకాల సేవలు: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 27 , 2026 | 12:56 PM