Share News

కాకినాడ పేలుడు ఘటనపై మంత్రుల స్పందన

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:34 PM

కాకినాడలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రులు స్పందించారు. ఈ ఘటనలో పలువురు మృతిచెందడం మాటలకందని విషాదమని మంత్రి లోకేశ్ అన్నారు.

కాకినాడ పేలుడు ఘటనపై మంత్రుల స్పందన
Kakinada Explosion

అమారవతి, ఫిబ్రవరి 28: కాకినాడలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులర్పించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రి లోకేశ్ (Minister Lokesh) సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


పలువురు మృత్యువాతపడటం మాటలకందని విషాదమన్నారు. మృతులకు నివాళులర్పించారు మంత్రి. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు.


ఘోర ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి

narayana-london.jpg

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై ఇన్‌ఛార్జ్ మంత్రి నారాయణ (Minister Narayana) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఘటనకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఘటనా స్థలానికి వైద్యులను పంపించి తక్షణ వైద్య సాయం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు.


కార్మికుల మృతిపై హోంమంత్రి స్పందన

anitha-temple.jpg

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో పేలుడు ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. కార్మికుల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి హుటాహుటిన వేట్లపాలెంలో పేలుడు ఘటన స్థలానికి హోంమంత్రి బయలుదేరారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఎప్పటికప్పుడు హోం మంత్రి అనిత ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు.


తక్షణ వైద్య సహాయ చర్యలు చేపట్టండి: మంత్రి సత్యకుమార్

satyakumar.jpg

వేట్లపాలెంలో బాణసంచా పేలుడు ఘటనపై మంత్రి సత్య కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ వైద్య సహాయక చర్యలు చేపట్టాలని వైద్యశాఖ సెక్రటరీ, డీఎంఈ, డీఎంహెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు, ఇతర సిబ్బందిని సంఘటనా స్థలానికి వెంటనే పంపాలని.. అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


కాకినాడ ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆవేదన

mandipalli-Ramprasad.jpg

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా కేంద్రంలో పేలుడు ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికుల మృతి వార్తపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదకర యూనిట్లలో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ప్రత్యేక భద్రతలు, తనిఖీలు నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.


బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: పీవీఎన్ మాధవ్

madhav-ap-bjp.jpg

కాకినాడ పేలుడు ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. 5 కిలోమీటర్ల మేర పేలుడు ధాటికి పక్కనే ఉన్న బడులు, ఇళ్లు దెబ్బతినడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన ఉచిత వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అంటూ పీవీఎన్ మాధవ్ కోరారు.


ఇవి కూడా చదవండి...

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..

కాకినాడ బాణసంచా పేలుడు.. సహాయక చర్యలపై సీఎం ఆరా

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 28 , 2026 | 05:12 PM