Share News

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి

ABN , Publish Date - Mar 04 , 2026 | 09:38 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

త్వరలోనే పీపీపీ విధానంలో కాలేజీలు పూర్తి: మంత్రి
AP Assembly

అమరావతి, మార్చి 4: నాలుగు రోజుల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు (AP Assembly Session) ప్రారంభమయ్యాయి. ఈరోజు(బుధవారం) స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలను మొదలుపెట్టారు. ప్రైవేట్ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ఏర్పాటు చేయడంపై తణుకు ఎమ్మెల్యే ఏ.రాధాకృష్ణ ప్రశ్న లేవనెత్తారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రగల్భాలు పలికారని, చాలా కళాశాలల్లో పునాదులు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం.. ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో సీట్లు అమ్మే పద్ధతిని తెచ్చిందని.. 10 కళాశాలలను ఆరంభించి మధ్యలో వదిలేశారని విమర్శించారు.


గత ప్రభుత్వం వైద్య కళాశాలల నిధులను దారి మళ్లించిందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టిందని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఆ కళాశాలలను పీపీపీ విధానంలో త్వరగా పూర్తి చేయాలని సంకల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు. ‘పీపీపీలో కళాశాలల నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి. వైసీపీ పెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను ఏం చేస్తారు’ అని ప్రశ్నించారు. పీపీపీలో కళాశాలలు తీసుకునే వారిని జగన్‌మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు.


దీనిపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. 17 కళాశాలల్లో 11 నాబార్డు కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 సాస్కి కింద మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం వ్యయం రూ. 8,480 కోట్లు అని అన్నారు. జగన్ హయాంలో కేవలం రూ.15 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని.. అందులో పులివెందుల కళాశాలకే దాదాపు రూ. 500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ. 900 కోట్లు ఖర్చు చేసి పనులు చేపట్టిందని మంత్రి వివరించారు. కళాశాలలు నిర్మించామని వైసీపీ అసత్యాలు చెబుతోందని మంత్రి విమర్శించారు.


పార్వతిపురంలో భూసేకరణ కూడా చేపట్టలేదని అన్నారు. పది కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రెండు దశల్లో నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. వైసీపీ అరాచక పాలన కారణంగా సీట్ల సంఖ్య 11కి పడిపోయిందని, అయినా బెదిరింపులు ఆపడం లేదని విమర్శించారు. జగన్ ప్రైవేట్ కళాశాలల మాదిరిగా ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు ఇచ్చారన్నారు. రాబోయే రెండేళ్లలో పీపీపీ విధానంలో కళాశాలలు పూర్తి చేస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?

గ్రామీణాంధ్రకు అభివృద్ధి సొబగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 04 , 2026 | 09:50 AM